సర్కార్ చేతికి మాజీ సర్పంచుల బిల్లుల చిట్టా 

సర్కార్ చేతికి మాజీ సర్పంచుల బిల్లుల చిట్టా 
  • అసెంబ్లీలో చర్చ వేళ.. హుటాహుటిన వివరాలు సేకరణ  
  • ఈ-పంచాయతీ పోర్టల్ ద్వారా చేరిన డాటా  
  • 2019 నాటి బకాయిలపై ఏం తేల్చబోతోందనేదానిపై ఉత్కంఠ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల పంచాయితీ తుదిదశకు చేరుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగే చాన్స్ ఉండటంతో గ్రామ పంచాయతీల్లో నిలిచిపోయిన పనుల బకాయిల పూర్తి వివరాలు గురువారం ప్రభుత్వానికి చేరాయి. ప్రభుత్వం డెడ్‌‌‌‌లైన్ విధించి మరీ క్షేత్రస్థాయి నుంచి వివరాలను తెప్పించింది. ప్రస్తుతం ఈ లెక్కల వివరాలు ప్రభుత్వానికి చేరాయి.

కాగా, 2019 నుంచి గత సర్పంచుల హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల బిల్లుల లెక్క తేల్చేందుకు పంచాయతీరాజ్ శాఖ డీపీవోలను అప్రమత్తం చేసింది. వారి ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, డీఎల్‌‌‌‌పీవోలు రంగంలోకి దిగారు. నిర్దేశిత సమయంలోపే ‘ఈ-పంచాయతీ’ పోర్టల్‌‌‌‌లోని ‘ఎక్స్- సర్పంచ్ వర్క్ పెండెన్సీ’ మాడ్యూల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది జీపీల పెండింగ్ పనుల డేటాను సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదించారు.

అయితే, గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతర గ్రాంట్లకు సంబంధించి పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రతి పని వివరాలను అధికారులు పోర్టల్‌‌‌‌లో పొందుపరిచారు. పనుల మంజూరు ప్రొసీడింగ్ తేదీలు, ఎంబీ రికార్డు చేసిన తేదీలు, పనుల అంచనా వ్యయం, ఎంబీ రికార్డు ప్రకారం తేలిన విలువ, ఇప్పటివరకు చేసిన చెల్లింపులు, ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంతనేది వివరాలు పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి అందాయి.

అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు?

కొద్ది రోజులుగా బిల్లులు రాక అప్పులపాలయ్యామంటూ మాజీ సర్పంచులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో సభలో అధికారికంగా సరైన సమాధానం ఇచ్చేందుకే ప్రభుత్వం అత్యవసరంగా నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల వివరాలు ప్రభుత్వం చేతికి చేరడంతో.. అసెంబ్లీలో వీటిపై ఎలాంటి ప్రకటన చేయబోతోంది? నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.