- సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా
- ఏఐ ఫొటోలు చూసి మురుస్తున్న జనం
కరీంనగర్, వెలుగు: 1980ల నాటి ఏఐ వింటేజ్ ఫొటో ట్రెండ్ రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్‌లో ఎక్కడ చూసినా 1980 కాలం నాటి వింటేజ్ లుక్స్‌తో కూడిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్లలో జెమిని, చాట్ జీపీటీ, గ్రోక్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో నెటిజన్లు తమ ప్రస్తుత ఫొటోలను 80 నాటి క్లాసిక్ రెట్రో స్టైల్లోకి మార్చుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ‘మ్యాజిక్’ చూసి మురిసిపోతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్‌ను సామాన్యుల నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ లీడర్ల వరకు ప్రతి ఒక్కరూ ఫాలో కావడం విశేషం.
బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద గల్లా అంగీలు..
1970, 80ల నాటి ఫ్యాషన్ ఈ తరానికి పెద్దగా తెలియదు. 80ల నాటి బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద గల్లాతో కూడిన కలర్ ఫుల్ షర్టులు, క్లాసిక్ హెయిర్ స్టైల్, పెద్ద సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అప్పటి కాలేజీల్లో, సినిమాల్లో ఉన్నత వర్గాల లైఫ్ స్టైల్‌గా ఉండేది.
ఇప్పటి ఫొటోలను చాట్ జీపీటీ, జెమిని, గ్రోక్, పర్‌ప్లెక్సిటీలాంటి ఏఐ యాప్‌లలో అప్ లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే.. చేతిలో పుస్తకాలు పట్టుకొని పాత బిల్డింగ్‌ల ముందు నిలబడటం, వింటేజ్ స్కూటర్లు, అంబాసిడర్ కార్లు, పాతకాలపు స్టూడియో సెట్టింగ్స్‌తో వింటేజ్ బ్యాక్ గ్రౌండ్, వెలిసిన రంగులతో అద్భుతమైన ఫొటోలు ఇస్తున్నాయి.
సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా..
80స్ ట్రెండ్ యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. సామాన్యుల నుంచి టాలీవుడ్ నటులు, పొలిటిషీయన్ల వరకు అందరూ ఫాలో అవుతున్నారు. ఈ రెట్రో ట్రెండ్‌తో కూడిన టాలీవుడ్ హీరో, హీరోయిన్ల ఫొటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభాస్, - గోపీచంద్, మహేశ్ బాబు - పవన్ కల్యాణ్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ 80ల నాటి కాలేజీ మిత్రులుగా ఉన్న ఏఐ పోర్ట్రెయిట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ మెహర్ రమేశ్.. పవన్ కల్యాణ్‌తో కలిసి ఉన్న ఒక వింటేజ్ లుక్ పిక్‌ను షేర్ చేస్తూ ‘ఓజీ ఎప్పటికీ ఓజీనే’ అని పోస్ట్ పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.
పొలిటీషియన్స్‌లోనూ క్రేజ్..
కేవలం సినీ తారలే కాదు.. రాజకీయ నాయకుల ఏఐ ఫొటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాలేజీ రోజుల్లో ఇలా ఉండేవారేమో అనేలా రూపొందించిన 80స్ లుక్ ఏఐ ఫొటో ఆయన సోషల్ మీడియా హ్యాండిళ్లలో వైరల్ అయింది.
ఆయనతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు శశిథరూర్‌లాంటి వారు కూడా ఈ రెట్రో లుక్‌లో కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాత్రం 80లనాటి ఫొటో కోసం తనకు చాట్ జీపీటీ అవసరం లేదంటూ.. 80ల్లో సవ్వీ అనే ఇంగ్లిష్ మ్యాగజైన్ కవర్ పేజీపై వేసిన తన ఒరిజనల్ ఫొటోను షేర్ చేశారు.
ప్రాంప్ట్ ఇలా ఇస్తే సరి..
‘‘నా ఫేస్ , ఫేస్ షేప్ , స్కిన్ టోన్, ఎక్స్ప్రెషన్స్ అలాగే ఒరిజినల్ ఫేస్ ఉంచుతూ.. ఈ ఫొటోను 1980ల నాటి రెట్రో ఫొటోగా మార్చండి. అసలైన 1980ల ఫ్యాషన్‌కు సరిపోయేలా నా బట్టలు, హెయిర్ స్టైల్ అలాగే ఆర్నమెంట్స్ మార్చండి.
వామ్ అనలాగ్ లైటింగ్, క్లియర్ ఫిల్మ్ గ్రెయిన్, కొద్దిగా మసకబారిన రంగులు, సాఫ్ట్ ఫోకస్ అలాగే నేచురల్ బాడీ షేప్‌ను ఉపయోగించండి. కేవలం వింటేజ్ ఫిల్టర్‌ను అప్లై చేసినట్లు కాకుండా, ఈ ఫొటో నిజంగా 1980లలో తీసినట్టుగా కనిపించేలా చేయండి.
స్మార్ట్ ఫోన్లు, లేటెస్ట్ కార్లు అలాగే ప్రస్తుత కాలపు బట్టలులాంటి ఆధునిక వస్తువులను తొలగించండి’’ అని చాట్ జీపీటీ, గ్రోక్, జెమినిలాంటి యాప్స్‌లో తెలుగులో ప్రాంప్ట్ ఇస్తే వింటేజ్ ఫొటోను ఇస్తుంది.
