కోటపల్లి:పెళ్లికాని యువతిని తల్లిగా చూపించి..పౌష్టికాహారం స్వాహా.. బయటపడ్డ అంగన్వాడీ సెంటర్ బాగోతం

కోటపల్లి:పెళ్లికాని యువతిని తల్లిగా చూపించి..పౌష్టికాహారం స్వాహా.. బయటపడ్డ అంగన్వాడీ సెంటర్ బాగోతం

కోటపల్లి, వెలుగు: పెళ్లికాని యువతిని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రికార్డుల్లో తల్లిగా చూపించి.. అంగన్వాడీ కేంద్రం నుంచి పౌష్టికాహార సరుకులు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లిలోని అంగన్వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌–1లో ఓ పెళ్లికాని యువతి పేరును ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పిల్లలున్న మహిళగా నమోదు చేసి.. ఆమె పేరుతో బాలమృతం, గుడ్లు, పాలు, ప్రొటీన్‌‌‌‌‌‌‌‌ తదితర సరుకులు తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

పెళ్లే కాని యువతికి పిల్లలున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడం ఏమిటని మండిపడ్డారు. తమ కుమార్తె వ్యక్తిగత వివరాలను తప్పుగా నమోదు చేసి కుటుంబ పరువుకు భంగం కలిగించారని తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అంగన్వాడీ టీచర్‌‌‌‌‌‌‌‌ వేముగంటి సరోజన, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.