హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ఆటోలు నడుపుకునేటోళ్లు, పాత ఇనుప సామాను అమ్ముకునేవాళ్లు, ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేసుకునేవాళ్లు, క్యాబ్‌లు నడిపేవాళ్లు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక కాలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. బతుకుదెరువు కోసం తీసుకొచ్చుకున్న వాహనాలు ఉన్నాయని వారిని ఎంపిక చేయలేదని తెలిపారు. అలాంటివాళ్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలించాలని కోరారు. గురువారం అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల అంశంలో వచ్చిన ప్రశ్నపై ఆయన మాట్లాడారు.
ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగాయని, మేస్త్రీలు, లేబర్ ఖర్చులే రూ.4 లక్షల దాకా అవుతున్నాయని చెప్పారు. అలాంటిది ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు పూర్తవడానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఖర్చవుతున్నదని పేర్కొన్నారు. దీంతో కొందరు మధ్యలోనే ఇండ్లు ఆపేయాల్సి వస్తున్నదని వివరించారు. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చే నిధుల పెంపుపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఇంటి స్థలం కూడా లేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, వాళ్లందర్నీ గుర్తించి వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే బాగుంటుందని సూచించారు.
మంత్రి పదవి ఇచ్చేది హైకమాండ్.. రేవంత్ రెడ్డి కాదు..
మంత్రి పదవి ఇచ్చేది కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమేనని, సీఎం రేవంత్ రెడ్డి కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను సీఎం రేవంత్ రెడ్డితో రాజీపడ్డట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని, నిధుల కోసం సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయే తప్ప, ఎప్పుడూ తిట్టుకోవాలని చూసేవారి ఆశ నెరవేరదని తేల్చిచెప్పారు.
సీఎంను కలిస్తే రాజీ అంటారు, కలవకపోతే దూరం పెరిగిందంటూ ప్రచారం చేస్తారని మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి బాధపడి ఉండొచ్చని, అందుకే ఆ విషయాన్ని ఆయన హైకమాండ్‌కు చేరవేసి ఉంటారని, ఇందులో సీఎంను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గంపై మాట్లాడే మాటలు తీవ్రంగా బాధిస్తున్నాయని, ఆయన ఆ విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
