సిద్దిపేట/ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలో కాంగ్రెస్ దళిత నాయకులు నిరసన నిర్వహించిన ప్రదేశాన్ని.. బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేసిన అంశంపై గజ్వేల్ ఏసీపీ నర్సింలు గురువారం విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా వరదరాజపూర్, ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లోబీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లు చల్లిన ప్రాంతాలని పరిశీలించారు.
ఫోరెన్సిక్ టీమ్ తో ఆధారాలు సేకరించగా, ఈ శుద్ధి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ దళిత నాయకులు నిరసన చేసిన ప్రదేశాల్లో బీఆర్ఎస్ నాయకులు పసుపు నీరు చల్లి శుద్ధి చేయడంపై ఎర్రవెల్లి గ్రామానికి చెందిన మొండి స్వామి, వరదరాజపూర్ గ్రామానికి చెందిన బొల్లారం శ్రీకాంత్, వర్గల్ కు చెందిన బాగనుల మోహన్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు తెలిపారు.
సీపీకి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఫిర్యాదు
శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు తప్పెట శంకర్ తో పాటు పలువురు నాయకులు గురువారం సీపీ రష్మీ పెరుమాల్ కు ఫిర్యాదు చేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని, వివక్షకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, పట్టణ మాజీ అధ్యక్షుడు సొప్పదండి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ సాకి ఆనంద్ పాల్గొన్నారు.
