న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తుండడంతో చిన్న సంస్థల కంటే పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనే ఉద్యోగాలకు ముప్పు ఎక్కువగా ఉందని ఇన్ఫోసిస్ కో– ఫౌండర్ నందన్ నిలేకని పేర్కొన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్) 2026లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
పెద్ద కంపెనీల్లో నిర్వహించే పనులు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటాయని, అలాంటి పనులను ఏఐ ద్వారా వేగంగా ఆటోమేట్ చేసి ఉద్యోగులను తీసేయడం వీటికి చాలా సులువని వివరించారు. జాబ్ సేఫ్టీపై వస్తున్న ఆందోళనలు నిజమేనని అన్నారు.
ఏఐ యుగంలో ఉద్యోగాల సృష్టికి కేవలం కొన్ని పెద్ద కంపెనీలపైనే ఆధారపడటం సరికాదని, కోట్లాది చిన్న వ్యాపారాలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయని నిలేకని పేర్కొన్నారు. ఒకరి నుంచి పది మంది ఉద్యోగులుండే చిన్న సంస్థల్లో పనులను ఏఐతో భర్తీ చేయడం సాధ్యం కాదని, అందువల్ల అక్కడ కొలువులు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
దేశంలో 2015లో 10 వేలుగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2025 నాటికి 1.5 లక్షలకు చేరిందని, 2035 నాటికి ఏకంగా 10 లక్షలకు చేరుకోవచ్చని తెలిపారు. టెక్నాలజీని చిన్న వ్యాపారాల సాధికారతకు ఉపయోగించి, ఆర్థిక వ్యవస్థను ‘ఏఐ- ప్రూఫ్’గా మార్చాలని నందన్ నిలేకని పిలుపునిచ్చారు.
ప్రతీ ఐదుగురిలో ఒకరి జాబ్ ఉఫ్
ఏఐ ప్రభావంతో 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందుతుందని, అదే టైమ్‌లో కాగ్నిటివ్ జాబ్స్ (మేధోపరమైన ఉద్యోగాలు) అవసరం తగ్గిపోతుందని ఏఐ రీసెర్చ్ సంస్థ ఆంత్రోపిక్ ఇన్‌స్టిట్యూట్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రతి ఐదుగురిలో ఒకరు జాబ్ కోల్పోతారని, వేతనాల్లో తగ్గుదల చూస్తామని తెలిపింది.
ఏఐ ప్రభావం 2026–2030 మధ్య ఆర్థిక వ్యవస్థలపై ఎలా ఉంటుందో ఈ రిపోర్ట్ అంచనా వేసింది. దీని ప్రకారం, విపరీత పరిస్థితుల్లో 2030 నాటికి కాగ్నిటివ్ జాబ్స్ సగానికిపైగా కనుమరుగవుతాయి. ఇందులో 90 శాతం పనులు పూర్తిగా ఆటోమేషన్ ద్వారా జరుగుతాయి. కాగ్నిటివ్ రంగంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మాత్రం అద్భుతంగా రాణిస్తుంది.
