న్యూఢిల్లీ: బంగారం స్మగ్లింగ్ ఆగకపోవడంతో నగల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమ రవాణాదారులు మార్కెట్ ధర కంటే రూ.8000 తగ్గించి అమ్ముతున్నారు. ఈ ఏడాది మే నెలలో బంగారంపై దిగుమతి సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి పెరగడం వల్ల గ్రే మార్కెట్ మరింత లాభదాయకంగా మారింది. ప్రస్తుతం సంవత్సరంలో చట్టవిరుద్ధ మార్గాల ద్వారా వచ్చే బంగారం పరిమాణం 100 టన్నుల వరకు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అధికారులు దాడులు పెంచారు.
గత నెల 27 కేజీల స్మగుల్డ్ బంగారాన్ని ఏజెన్సీ స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్టు చేశారు. అక్రమ బంగారు దిగుమతి నిజమైన వ్యాపారులకు ఏవిధంగానూ మేలు చేయబోదని, తాత్కాలిక ఆపరేటర్లకు మాత్రమే లాభమని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (ఐబీజేఏ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. బంగారంపై విధిస్తున్న భారీ సుంకాలు గ్రే మార్కెట్ చురుగ్గా ఉందనడానికి కారణమని పేర్కొన్నారు. అధిక దిగుమతి సుంకాలు భారతీయ, అంతర్జాతీయ బంగారం ధరల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతాయని చెప్పారు.
సుంకాలు పెంచిన ప్రతిసారీ ఇదే సమస్య
2013 ప్రారంభంలో బంగారంపై నాలుగు శాతం సుంకం పెరిగిన తర్వాత, అనధికారిక పసిడి దిగుమతులు 2013 మొదటి త్రైమాసికంలోని 10 టన్నుల నుంచి 2014 మొదటి త్రైమాసికంలో దాదాపు 70 టన్నులకు పెరిగాయి. 2013–2019 మధ్య సుంకాలు 10 శాతానికి చేరిన తర్వాత కూడా అక్రమ రవాణా ఆగలేదు. ఇది సగటున త్రైమాసికానికి 34 టన్నుల వరకు ఉంది.
ఈ విషయమై ఐబీజేఏ చైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ, బంగారంపై సుంకం పెంచడానికి బదులుగా ఎగుమతులు పెంచడానికి ప్రయత్నాలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం బంగారంపై సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలని కోరారు. 2022 జులైలో బంగారంపై సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన తర్వాత కూడా ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. 2022 రెండవ త్రైమాసికంలో 17 టన్నులుగా ఉన్న అనధికారిక దిగుమతులు ఏడాది చివరినాటికి దాదాపు 50 టన్నులకు పెరిగాయి. 2023లోనూ ఇవి కొనసాగాయని ఐబీజేఏ తెలిపింది. ఇక నుంచి కూడా స్మగ్లింగ్ పెరగవచ్చని పేర్కొంది.
