- తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశం
- గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలో పాల్గొన్న మైనర్ బాలికపై వేధింపులు, బెదిరింపులను తేలిగ్గా తీసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందూత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ ఒక పాడ్‌కాస్ట్‌లో సదరు మైనర్ బాలిక తండ్రి తల పగలగొట్టినట్టు గొప్పగా చెప్పుకున్నాడు.
అలాగే, ఢిల్లీ పోలీసులు, బీజేపీ, ఎన్డీయే నాయకులు తనకు తెలుసని తెలిపాడు. ఈ నేపథ్యంలో సీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తేగా భరద్వాజ్‌పై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌చేశారు.
గురువారం ఈ కేసులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనానికి బాధితురాలి తరఫు న్యాయవాది వివరాలు వెల్లడించారు. సదరు బాలికపైనే ఎదురు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అంతేకాకుండా ఆమె ఇంటిపై రాళ్ల దాడి కూడా జరిగిందని కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. నమోదైన ఎఫ్‌ఐఆర్, ఆ మైనర్ బాలిక, ఆమె కుటుంబానికి కల్పించిన భద్రతా ఏర్పాట్లు, నిందితులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వాలను కోరనున్నట్టు తెలిపింది.
ఇలాంటి వ్యవహారాలను తేలికగా తీసుకోలేమని.. చిన్నపిల్లలపై హింసకు పాల్పడే విషయంలో ఎవరినీ రక్షించకూడదని సీజేఐ వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ విద్యార్థి నేతకు నోటీసులు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై వేటుపడింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఢిల్లీలో సీజేపీ నిరసనలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ నేత అక్షత్ త్రిపాఠికి గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. మేజిస్ట్రేట్ నోటీసులు ఇవ్వడంపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిల్లలకు ‘సోషల్ మీడియా’ హద్దులు ఉండాల్సిందే..
18 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లల సోషల్ మీడియా వినియోగంపై హద్దులు ఉండాల్సిందేనని ఓ పిటిషన్‌పై విచారణలో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం కఠినమైన నిబంధనలు రూపొందించాలని అభిప్రాయపడింది. పిల్లలు సోషల్ మీడియాను స్వతంత్రంగా వాడకుండా ఉండేందుకు ఫైర్‌వాల్స్ తో పాటు ఇతర రక్షణ చర్యలు అవసరమని.. దీనిపై కేంద్రం స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.
గ్యాంగ్‌స్టర్ అబూసలేం పిటిషన్ రిజెక్ట్
1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూసలేం తనను రిలీజ్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషిన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. పోర్చుగల్ నుంచి భారత్‌కు తనను అప్పగించిన నిబంధనల ప్రకారం తన జైలు శిక్ష కాల పరిమితి 25 ఏండ్లు మాత్రమేనని అబూ సలేం పేర్కొన్నాడు. తాను ఇప్పటికే 25 ఏండ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నానని, విడుదల చేయాలని కోరగా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ తిరస్కరించింది.
