న్యూఢిల్లీ, వెలుగు: విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను అక్టోబర్ 13న విచారించనున్నట్లు జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలను ప్రస్తుతం కొనసాగుతున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలోనే ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా విచారణ సందర్భంగా.. కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్‌లో వాదనలు తుది దశకు చేరుకున్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ట్రిబ్యునల్ విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 13కి మారుస్తున్నట్లు వెల్లడించింది.
