- వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నెం.83/1లోని 5 ఎకరాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లను విడగొట్టి లేఔట్‌ను సవరించి వేలం నిర్వహించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు ప్లాట్లకు లేఔట్ ప్లాన్‌ను ఎలా మార్చారు. వాటి నంబర్ల మార్పు తదితరాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. దుర్గం చెరువు ముఖద్వారంలో ఉన్న రెండు ప్లాట్ల ఈ-వేలాన్ని సవాల్ చేస్తూ బేగంపేటకు చెందిన జె.ప్రణయ్సింహారావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ 1998, 2003లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ భూమిని చారిత్రక, శిలా రక్షణ ప్రాంతంగా గుర్తించినట్లు తెలిపారు. 2006లో ఏపీఐఐసీ వేలం వేసినప్పటికీ ఇవి దుర్గం చెరువుకు సమీపంలో వాలుగా ఉండడంతో వాటిని పరిరక్షించాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేయడంతో కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని హామీ ఇచ్చి వేలం రద్దు చేశారన్నారు.
ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన సాంకేతిక కమిటీ 50 మీటర్ల బఫర్‌జోన్‌లో అభివృద్ధికి అనుమతి ఇవ్వడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వేలం వేయడానికి అవకాశం ఏర్పడిందన్నారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారమే వేలం నిర్వహించినట్లు తెలిపారు. బఫర్‌జోన్ పరిధిలో స్థలం లేదని, అంతేగాకుండా వేలం ప్రాంతంలో ఎలాంటి పురాతన శిలలు లేవని తెలిపారు. వేలం వేసిన ప్రాంతం చుట్టూ 50 మీటర్ల బఫర్‌జోన్ నిబంధనను అమలు చేసినట్లు తెలిపారు.
పురాతన శిలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అత్యధిక బిడ్ వేసిన వారికి అంగీకార లేఖ కూడా అందించినట్లు తెలిపారు. బిడ్ పొందిన ఎంఎస్ఎన్ రియాల్టీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిందంటూ దాని తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వేలం విక్రయ విలువలో 25 శాతం రూ.355 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీజీఐఐసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
