నిర్మల్/కామారెడ్డి, వెలుగు: రైస్ మిల్లర్లు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సివిల్ సప్లైస్ శాఖ అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్లు, తనిఖీలు, వేధింపులకు నిరసనగా ఈనెల 11 నుంచి జిల్లాలోని రైస్ మిల్లుల్లో మిల్లింగ్, ప్రొడక్షన్ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తోందన్నారు.
ప్రతి మిల్లింగ్ ప్రక్రియలో 20 శాతం వరకు ఆపరేషనల్ లాస్ ఉంటుందని, దీన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో కేటాయించే వివిధ రకాల ధాన్యంపై ముందస్తుగా టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి, వాస్తవ పరిమాణాలకు అనుగుణంగా రికవరీని నిర్దేశించాలని కోరారు. సోర్టెక్స్ చేసే సమయంలో రంగు మారిన గింజలు తొలగించడం వల్ల జరిగే బియ్యం నష్టాన్ని కూడా రికవరీ లెక్కల్లో కలపాలన్నారు. మిల్లర్లపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కృష్ణ దాస్, మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సలహాదారు టి.రాజశేఖర్రావు, కోశాధికారి సందీప్, మిల్లర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో రైస్ మిల్లుల్లో ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన మిల్లర్లు గురువారం కలెక్టరేట్ఎదుట ధర్నా చేశారు. బియ్యం అప్పగించడానికి తగిన గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇవ్వకుండా మిల్లులపై దాడులు చేయడం సరికాదన్నారు. ఇష్టారాజ్యంగా చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఆల్ఇండియా రైస్ మిల్లర్స్అసోసియేషన్ సెక్రటరీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సెక్రటరీ సంతోష్, క్యాషియర్ భూమేశ్, ప్రతినిదులు కంచర్ల లింగం, గౌరిశంకర్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
