నిజామాబాద్, వెలుగు: మత్తు పదార్థాలు అమ్ముతున్న వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేయడమే కాకుండా.. వారి ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని పలువురికి చెందిన రూ. 3.2 కోట్ల విలువైన ఆస్తులను గురువారం సీపీ సాయిచైతన్య జప్తు చేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ కు చెందిన గంధం శ్రీనివాస్‌గౌడ్, బొట్ల కాటమయ్య గౌడ్ రాజస్తాన్ నుంచి ఆల్ఫ్రాజోలం తెప్పించి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో 2025లో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా.. ఆల్ఫాజోలం సరఫరాదారుడైన, రాజస్తాన్ కు చెందిన రతన్‌సింగ్ పరారీలో ఉన్నారు.
అయితే.. మత్తు పదార్థాల అమ్మకంతో శ్రీనివాస్ గౌడ్, కాటమయ్య గౌడ్ సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు నిర్ణయించిన సీపీ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిందితులతో సంబంధాలు ఉన్న పది మంది సెల్‌ఫోన్ సమాచారం, టెక్నాలజీ ఆధారంగా నిజామాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు వెళ్లి తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లను కలిశారు.
నిందితులు తమ తల్లి, భార్య పేరుతో ఆస్తులను సంపాదించినట్లు గుర్తించి వాటిని జప్తు చేశారు. మొత్తం 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, 667 గజాల ఇంటి స్థలం, ఫోర్ వీలర్స్, టు వీలర్‌తో పాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.5 లక్షలను సీజ్ చేశారు. మొత్తం ఆస్తి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.3.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
