నవీపేట్: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నవీపేట్: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు :  ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది జూన్, జులైలో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం త్రివేణి సంగమ ప్రాంతమైన నిజామాబాద్​ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద, నవీపేట్ మండలం యంచ వద్ద గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి గురువారం ఆయన భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కందకుర్తి వద్ద రూ.6.05 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి, రూ.3.90 కోట్లతో రోడ్లు, రూ.5 కోట్లతో ఆలయ అభివృద్ధి, నవీపేట్ మండలంలో యంచ వద్ద రూ.2.15 కోట్లతో పుష్కర ఘాట్, రూ.70 లక్షలతో రోడ్డు నిర్మాణలు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ ఆర్డీవో విజయ కుమారి, తహసీల్దార్లు శ్రవణ్, వెంకట రమణ, సర్పంచ్ బేగరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.