అన్నా.. నేను చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్ పెట్టి కొడుకుతో సహా బావిలో దూకిన మహిళ

అన్నా.. నేను చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్ పెట్టి కొడుకుతో సహా బావిలో దూకిన మహిళ
  • మహిళ డెడ్ బాడీ లభ్యం, బాలుడి కోసం గాలింపు
  • జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఘటన

మల్యాల, వెలుగు: 'అన్నా నేను చనిపోతున్న' అని సోదరుడికి మెసేజ్ పెట్టిన అనంతరం ఓ మహిళ తన కొడుకుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గుడిపేట శివారులో గురువారం జరిగింది.

ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం... మల్యాల గ్రామానికి చెందిన గుండేటి కవిత (34), దశరథం దంపతులకు నిఖిలేశ్, శశాంక్ (7) కొడుకులు. దశరథం ముంబైలో పనిచేస్తుండగా.. కవిత ఇద్దరు కొడుకులతో కలిసి గ్రామంలో ఉంటోంది. గురువారం తెల్లవారుజామున కవిత శశాంక్ ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ సమయంలో తాను చనిపోతున్నానంటూ తన అన్న కొమురయ్యకు ఫోన్ లో మెసేజ్ పెట్టి స్విచాఫ్ చేసింది.

దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద చెప్పులు, మొబైల్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సాయంతో బావిలో గాలించారు.

కవిత డెడ్ బాడీ దొరకగా.. శశాంక్ కోసం రాత్రి వరకు గాలించినా దొరకలేదు. కాగా, ఆర్థిక ఇబ్బందులు, శశాంక్ అనారోగ్యం కారణంగానే మనస్తాపానికి గురైన కవిత కొడుకుతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి అన్న కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.