హుజురాబాద్: నిరసన బాట పట్టిన మున్సిపల్ కార్మికులు

హుజురాబాద్: నిరసన బాట పట్టిన మున్సిపల్ కార్మికులు

హుజురాబాద్, వెలుగు: రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో హుజురాబాద్ మున్సిపల్ కార్మికులు నిరసన బాట పట్టారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం ఉదయం విధులను బహిష్కరించి స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించారు. యూనియన్ అధ్యక్షుడు ఎండీ అజ్ఙా, ప్రధాన కార్యదర్శి బొరగాల కుమార్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. 

వేతనాలు అందక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, నిత్యావసరాలు కొనుగోలు చేయలేక, పిల్లల చదువుల ఫీజులు కట్టలేక అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్​చేశారు. యూనియన్ ఉపాధ్యక్షురాలు రాసపల్లి సరోజన, నాయకులు సులోచన, వినోద్, కాంత్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు.