ఇతరులు చెబుతున్నారని గుడ్డిగా నమ్మొద్దు.. సామాజిక బాధ్యతను పెంచుకోవాలని సూచన

ఇతరులు చెబుతున్నారని  గుడ్డిగా నమ్మొద్దు.. సామాజిక బాధ్యతను పెంచుకోవాలని సూచన
  • ఆలోచించి నిర్ణయం తీసుకునే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలి
  •     పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వెల్లడి

 ఉప్పల్, వెలుగు: ఇతరులు చెబుతున్నారని ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దని, దాని గురించి ఆలోచించి.. తెలుసుకొని నిర్ణయం తీసుకునే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌‌‌‌ స్కూల్‌‌లో నిర్వహించిన 'ఫెరియా వై ఫియస్టా - ఫోర్త్‌‌ ఎడిషన్‌‌' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా విద్యార్థులతో ఎంపీ ముచ్చటించారు. నేటి పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానంతోపాటు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఎంతో అవసరమన్నారు. ఏదైనా విషయం వినగానే అది నిజమేనని భావించకుండా, దానిపై ప్రశ్నలు వేసి, సరైన సమాచారాన్ని సేకరించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 

విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రశ్నించేతత్వం, విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతోపాటు విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ సామాజిక బాధ్యతను పెంచుకోవాలని చెప్పారు. 'ఫెరియా వై ఫియస్టా' కార్యక్రమం విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు వారి ఆలోచనా శక్తిని ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తుందన్నారు. ప్రతి అంశాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో విద్యార్థులు ముందుకు సాగాలని, భవిష్యత్‌‌లో దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.


విద్యార్థులు ఆల్‌‌రౌండర్లుగా ఎదగాలి: కొమురయ్య


విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు వచ్చేలా ఆల్‌‌రౌండర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ, నాచారం డీపీఎస్ స్కూల్ చైర్మన్ మల్క కొమురయ్య అన్నారు. ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో విద్యా ప్రమాణాలను మరింత పెంచుతున్నామని తెలిపారు. 

విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. డీపీఎస్ ఫియస్టాలో సీనియర్ రాజకీయ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కొత్త ఆలోచనలను బిజినెస్ అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు.

 ఏఐ, కోడింగ్, డేటా అనాలిసిస్ వంటి ఆధునిక నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువత తమ ప్రతిభ, ఆవిష్కరణలతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.