రాజకీయాల్లో బూతుల సంస్కృతికి స్వస్తి పలకాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

రాజకీయాల్లో బూతుల సంస్కృతికి స్వస్తి పలకాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

యాదగిరిగుట్ట, వెలుగు: రాజకీయాల్లో రోజురోజుకు బూతుల సంస్కృతి పెరిగిపోతోందని, దీనికి అడ్డుకట్ట పడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కేవలం మీడియాలో హైలైట్ కావడం, పాపులారిటీ సంపాదించడం కోసమే నాయకులు ఇలాంటి దిగజారుడు భాషను వాడుతున్నారన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజం కోసం వంద మంచి మాటలు మాట్లాడినా, ప్రజా సమస్యలపై చర్చించినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అదే అదే అసభ్యకరంగా మాట్లాడితే, బూతులు తిడితే.. బాక్సుల్లో వేసి మరీ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

నేరస్తులు, తప్పు చేసిన వారిని హీరోలుగా చూపే ధోరణి మీడియాలో కూడా మారాలని సూచించారు. స్పీకర్ స్థానం రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. సీఎంనైనా, ప్రతిపక్ష నేతనైనా విమర్శించే హక్కు ఉంటుంది, కానీ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరచడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. తప్పు జరిగిందని భావిస్తే హుందాగా వివరణ ఇవ్వాలే తప్ప, ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు చేసి ఉంటే.. కేసీఆర్ స్వయంగా స్పీకర్ కు ఫోన్ చేసి వివరణ ఇచ్చి ఉంటే రాజకీయాల స్థాయి పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజా తీర్పును, ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అసెంబ్లీకి హాజరుకాకుండా నిరసన తెలపడం సరైన పద్ధతి కాదన్నారు. అసెంబ్లీకి రాలేకపోతే జీతభత్యాలు వదులుకోవాలన్నారు.