నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే శాసనాలు, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచేందుకు పౌరులు, చరిత్రకారులు సహకరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఎక్కడైనా ఇటువంటి గ్రంథాలు శాసనాలు లభిస్తే వెంటనే జిల్లా పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీకి 80744 87020 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా నాగార్జునసాగర్ (వైజాగ్ కాలనీ), ఛాయా-పచ్చల సోమేశ్వర, చెరువుగట్టు దేవాలయాలు, దేవరకొండ కోట వంటి ఐదు ప్రధాన ప్రాంతాల్లో వసతులు కల్పించడానికి, ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
రాబోయే 2026-27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సెప్టెంబర్ 25 నాటికి అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 356 కేంద్రాల్లో పారదర్శకతను పాటించేందుకు ఓపీఎంఎస్ విధానం, లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశామన్నారు. ధాన్యం నిల్వ కోసం గోదాములతో పాటు అవసరమైతే మూతపడిన సినిమా థియేటర్లు, ప్రైవేటు షెడ్లను వినియోగించుకోవాలని చెప్పారు.
