ములుగు, వెంకటాపూర్(రామప్ప),వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ములుగు మండలం బండారుపల్లిలోని తెలంగాణ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు.
స్కూల్‌లోని క్లాస్ రూమ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన, భోజన పట్టిక, సరుకుల నిల్వలకు సంబంధించిన నమోదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. డీఈవో సిద్ధార్థరెడ్డి, స్కూల్ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు.
