- అవమాన భారంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భార్యాభర్తలు
హనుమకొండ, వెలుగు: హనుమకొండకు చెందిన కేదారి ఫుడ్ కోర్టు నిర్వాహకులు కేదారి, పుష్పలత దంపతుల మరణానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని, వారే ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. అప్పుల భారానికి తోడు, హోటల్ కిరాయి కట్టకపోవడంతో ఓనర్ పెట్టిన ఇబ్బందుల కారణంగానే బుధవారం రాత్రి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తేలింది. ఘటనలో కేదారి అక్కడికక్కడే చనిపోగా.. పుష్పలత ఎంజీఎం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం ఉదయం చనిపోయింది.
లింగాల కేదారి 1990లో హనుమకొండ అదాలత్ జంక్షన్ లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశాడు. రూ.20, రూ.50కే భోజనం పెట్టేవాడు. ఇద్దరు వేస్ట్ చేసే ఆహారంతో మరొకరి కడుపు నిండుతుందని చెప్పే కేదారి.. ఫుడ్ వేస్ట్ చేయకుండా చూసుకునేవాడు. ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేస్తే.. వారికి ఫైన్ విధించేవాడు.
ఇదిలా ఉంటే తక్కువ ధరకే జనాల కడుపు నింపాలని ఆలోచించిన కేదారి.. ఇందుకోసం తనకున్న ఆస్తులు అమ్ముకున్నాడని బంధువులు చెబుతున్నారు. హనుమకొండ రెడ్డి కాలనీలో ఉండే ఇంటితో పాటు మరో రెండు చోట్ల ఉన్న భూములు సైతం అమ్మేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లు విలువైన ఆస్తులు అమ్ముకుని పేదల ఆకలి తీరుస్తూ.. అదాలత్ సమీపంలోని ఓ ఇంట్లో కొన్నాళ్లుగా కిరాయికి ఉంటున్నారు.
రెంట్ కట్టడం లేదని హోటల్కు తాళం వేసిన ఓనర్
సేవా కార్యక్రమాల కారణంగా లింగాల కేదారి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రెండు నెలలుగా హోటల్ కిరాయి సైతం కట్టని పరిస్థితి ఏర్పడింది. దీంతో బిల్డింగ్ ఓనర్ రాము కేదారితో గొడవకు దిగాడు. హోటల్ సామాగ్రిని బయట పడేస్తానని, రెంట్ కట్టేవరకు హోటల్ నడిపేందుకు వీలు లేదని చెప్పడంతో పాటు, కేదారి భార్య పుష్పలతను బయటకు నెట్టి షెట్టర్ కు తాళం వేశాడు. విషయం తెలుసుకున్న కేదారి ఫుడ్ కోర్టుకు చేరుకున్నాడు.
ఇన్నాళ్లు తమ కుటుంబానికి ఆధారమైన హోటల్ తెల్లారి నుంచి తెరిచే అవకాశం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే తమ బంధువులకు ఫోన్ చేసి ఆవేదనను చెప్పుకున్నాడు. అనంతరం అవమానభారంతో భార్యాభర్తలు కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కేదారి అక్కడే చనిపోగా, పుష్పలత హాస్పిటల్ లో చనిపోయింది. కేదారి కొడుకు పృథ్వీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ రంజిత్ కుమార్ తెలిపారు.
