- రాష్ట్రంలో 6 నుంచి 11 ఏండ్ల పిల్లలకు డెంటల్ స్క్రీనింగ్
- ఈ ఏడాది 3,616 మందికి టెస్టులు చేయాలని టార్గెట్
- ఎన్‌హెచ్‌ఎం నుంచి రూ.22.32 లక్షలు మంజూరు
నల్గొండ, వెలుగు: చిన్నారులను ఫ్లోరోసిస్ భూతం వెంటాడుతోంది. తాగునీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉండటంతో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లు డెంటల్ ఫ్లోరోసిస్ సమస్యతో బాధ పడుతున్నారు. చిన్నప్పుడే పళ్లు పసుపురంగులోకి మారడం, గారపట్టడం, చిగుళ్లు బలహీనపడి పుప్పిపల్లు రావడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు వైద్యఆరోగ్య శాఖ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోఈ సమస్య తీవ్రంగా ఉన్న 9 జిల్లాల్లో డెంటల్ స్క్రీనింగ్ డ్రైవ్ చేపట్టనుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కింద చేపట్టే ఈ స్కీమ్‌కు నేషనల్ హెల్త్ మిషన్ ప్రొసీడింగ్స్ జారీ చేయడంతోపాటు నిధుల కేటాయించింది.
6 నుంచి 11 ఏండ్ల పిల్లలలోనే ఎక్కువ
ఫ్లోరోసిస్ ప్రభావం పాలపళ్లు ఊడి శాశ్వత దంతాలు వచ్చే దశలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 6 నుంచి 11 ఏండ్ల వయసున్న బడి పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఫ్లోరైడ్ నీటిని తాగినా, ఫ్లోరైడ్వాటర్తో పండించిన ఆహారాన్ని తీసుకున్నా నేరుగా దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.
పళ్లపై తెల్లటి గీతలు రావడం, పళ్లు పసుపు, గోధుమ రంగులోకి మారడం, పుప్పిపల్లలా రాలిపోవడం, తీవ్రమైన పంటినొప్పి రావడం వంటి సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 2026–27కి గాను 3,616 మంది పిల్లలకు పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నిరుడు 3,444 మంది పిల్లలకు పరీక్షలు చేయగా ఈ సారి అదనంగా మరో 5 శాతం మంది పిల్లలకు స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం అంగన్‌వాడీలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత సంవత్సరం స్క్రీనింగ్ నిర్వహించారు. ఈసారి కూడా అదే జిల్లాల్లో స్క్రీనింగ్కొనసాగనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉన్న మర్రిగూడ, మునుగోడు, దేవరకొండ, నాంపల్లి, చౌటుప్పల్ మండలాలపై ఈసారి అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.
రూ.22.32 లక్షలు మంజూరు
ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కోసం ఈ ఏడాదికిగాను ఎన్‌హెచ్‌ఎం రూ.22.32 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు సగటున రూ.2.48 లక్షలు కేటాయించారు. ఇందులో డయాగ్నసిస్ కోసం ఒక్కో జిల్లాకు రూ.1.68 లక్షల చొప్పున మొత్తం రూ.15.12 లక్షలు, రవాణా కోసం రూ.5.40 లక్షలు, అవగాహన కోసం రూ. 1.80 లక్షలు కేటాయించారు. రాష్ట్రస్థాయిలో ప్రోగ్రామ్ అమలు, ఫీల్డ్ లెవల్ మానిటరింగ్ కోసం ఇద్దరు ఫ్లోరోసిస్ కన్సల్టెంట్లను యథావిధిగా కొనసాగించనున్నారు.
