హన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం 

హన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం 

హన్మకొండ పట్టణంలోని అదాలత్ జంక్షన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లింగాల కేదారి హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు హోటల్‌ అంతటా వ్యాపించడంతో అక్కడ ఉన్న కేదారి, ఆయన భార్య పుష్ప మంటల్లో చిక్కుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కేదారి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా కేదారి మృతిచెందారు. కేదారి భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో కేదారి దంపతుల సేవలు

హనుమకొండ బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన లింగాల కేదారి, పుష్ప దంపతులు అదాలత్ జంక్షన్ లో దాదాపు 40 ఏండ్లుగా  హోటల్ నిర్వహిస్తున్నారు. జిల్లా కోర్టు సముదాయంతో పాటు వివిధ పనుల నిమిత్తం హనుమకొండకు వచ్చే జనాలకు లింగాల కేదారి దంపతులు తక్కువ ధరకే అన్నం పెట్టేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు లింగాల కేదారి సుపరిచితుడు. లింగాల కేదారి కేవలం హోటల్ యజమానిగానే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సేవలతో స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ఉద్యమకారులకు కేదారి దంపతులు ఉచితంగా భోజనం అందించారు. ఉద్యమకారులకు అండగా నిలుస్తూ తమ వంతు సాయం చేశారు. 

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉద్యమకారులకు భోజనం అందించిన కేదారి దంపతుల సేవలను పలువురు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. కేదారి అకాల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేదారి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఉద్యమకారులు.. ఉద్యమ సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమకు ఆప్యాయంగా భోజనం అందించిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.