మెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్...ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం

మెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్...ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఓ మందుబాబు నడిరోడ్డుపై హల్‌చల్ సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించిన వ్యక్తి బస్ డిపో సమీపంలో వచ్చిపోయే వాహనాలను అడ్డుకుంటూ వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆర్టీసీ బస్సును సైతం అడ్డుకుని బస్సు పైకి ఎక్కాడు. అనంతరం డ్రైవర్‌ను నానా బూతులు తిడుతూ దాడికి యత్నించాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.మందుబాబు చేస్తున్న చేష్టలు సరికావంటూ అతని భార్య వారించేందుకు ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. భార్యను రోడ్డుపై పడవేసి కొట్టాడు.  తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని సైతం దుర్భాషలాడుతూ, కొట్టేందుకు ప్రయత్నిస్తూ నడిరోడ్డుపై హంగామా చేశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మందుబాబు వీరంగంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు చివరకు అతడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ ఘటనపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు