కరీంనగర్‌ : నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్..లీడర్ల ఒత్తిడితో అరెస్ట్ కు వెనుకంజ!

కరీంనగర్‌ : నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్..లీడర్ల ఒత్తిడితో అరెస్ట్ కు వెనుకంజ!
  • మాజీ కార్పొరేటర్ భర్తపై కేసు నమోదు చేసిన కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు 

కరీంనగర్‌‌‌‌, వెలుగు: కరీంనగర్‌‌‌‌లో భూకబ్జాలు, నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలు జిల్లాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో అప్పటి సీపీ మహంతి భూమాఫియాపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అడపదడపా నగరంలో భూకబ్జాలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

తాజాగా కరీంనగర్ అలుగునూరుకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌‌‌‌ భర్త తన అనుచరులతో కలిసి కబ్జాదారులతో కలిసి ఓ సామాన్యుడి భూమిని అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకోవడంతోపాటు కబ్జాకు పాల్పడడం, అసలు భూయజమానులను బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

  బాధితుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ కార్పొరేటర్ తోపాటు ఆమె భర్తపై కేసు నమోదు కాగా,  నిందితులను అరెస్టు చేయకుండ కరీంనగర్ కు చెందిన బడా లీడర్లు పోలీసులపై ఒత్తిడి చేయడం వివాదాస్పదంగా మారింది.

నకిలీ రిజిస్ట్రేషన్ ఇలా.. 

కరీంనగర్ లోని కోతిరాంపూర్‌‌‌‌పరిధిలో దాదాపు మూడు గుంటల భూమిని బాధితులు 2019లో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ భూమికి హద్దు రాళ్లు పాతుకున్నారు. ఈ క్రమంలో పక్క సర్వే నంబర్ కు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి తమదంటూ కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. 

2012 నాటికే మాన్యువల్ పహానీలు నిలిచిపోగా, 2017లో అలాంటి పహానీలను సృష్టించి, ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని తమపేరిట రిజిస్ట్రేషన చేసుకున్నారు. ఆ తర్వాత అసలు భూయజమానులను ఆ స్థలంలోకి రాకుండ అడ్డుకున్నారు. 

2024లో సీపీగా అభిషేక్ మహంతి ఉన్న సమయంలోనే వివాదం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. సర్వే ప్రకారం నడుచుకుంటామని, ఎవరి ప్లాట్ అని తేలితే వాళ్లకే ప్లాట్ ఇచ్చేస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. రెండేండ్ల తర్వాత అదే భూమిపై తిరిగి వివాదం లేవదీశారు. దీంతో పోలీసులు ఆ పేపర్ల జన్యునిటీపై కరీంనగర్‌‌‌‌అర్బన్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ ఆఫీసర్ల ఒపినీయన్ కోరారు. 

ఆ పహనీలు, తహసీల్దార్‌‌‌‌ సంతకం, స్టాంపులను పరిశీలించి అవన్నీ ఫోర్జరీవని తహసీల్దార్‌‌‌‌ ఆఫీసు నుంచి రిపోర్టు ఇచ్చారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ భూమి కబ్జాలో భాగస్వాములుగా మాజీ కార్పొరేటర్‌‌‌‌, కార్పొరేటర్ భర్త సహా మొత్తం 13 మందిపై కబ్జాతోపాటు పలు నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ సెక్షన్లపై కేసు నమోదైంది. 

కాగా, భూకబ్జా కేసు నమోదు కావడంతో సదరు మాజీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బడా లీడర్ ను కలిసినట్లు తెలిసింది. పండుగ ముందు అరెస్టయితే పరువు పోతుందనే ఉద్దేశంతో అరెస్టు కాకుండా ఉండేందుకు పావులు కదిపారు. 

దీంతో బడా నేత పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌‌‌‌ చేసి దసరా ముగిసే వరకు అరెస్టు చేయవద్దని ఒత్తిడి చేయడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలిసింది. ఇదే అదనుగా సదరు కార్పొరేటర్ భర్త పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.