హుస్సేన్‌‌ సాగర్‌‌ లో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం.. ఈ నెల 24 వరకు ట్రాఫిక్‌‌ ఆంక్షలు

హుస్సేన్‌‌ సాగర్‌‌ లో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం.. ఈ నెల 24 వరకు ట్రాఫిక్‌‌ ఆంక్షలు

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా హుస్సేన్‌‌ సాగర్‌‌ పరిసరాల్లో బుధవారం దుర్గామాత విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ ట్రాఫిక్‌‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 నుంచి శనివారం ఉదయం 6 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని ప్రకటించారు. 

స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. పీపుల్స్‌‌ ప్లాజా, గార్డెన్‌‌ పాయింట్‌‌, జలవిహార్‌‌, సంజీవయ్య పార్కులోని బేబీ పాండ్స్‌‌ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి వెళ్లే వాహనాలకు మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధాన మార్గాల్లో మళ్లింపులు..

పంజాగుట్ట, రాజ్‌‌భవన్‌‌ రోడ్డు నుంచి ఖైరతాబాద్‌‌ ఫ్లైఓవర్‌‌ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్‌‌ వైపు మళ్లిస్తారు. నిరంకారి జంక్షన్‌‌ నుంచి ఇక్బాల్‌‌ మినార్‌‌ వైపు వెళ్లే సాధారణ వాహనాలను పాత సైఫాబాద్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ వద్ద రవీంద్రభారతి, మాసాబ్‌‌ట్యాంక్‌‌ వైపు పంపిస్తారు. ఇక్బాల్‌‌ మినార్‌‌ నుంచి సచివాలయం జంక్షన్‌‌ వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌‌ మీదుగా లోయర్‌‌ ట్యాంక్‌‌బండ్‌‌ వైపు మళ్లిస్తారు. 

ఖైరతాబాద్‌‌ బడా గణేశ్‌‌ లేన్‌‌, మింట్‌‌ కాంపౌండ్‌‌ నుంచి నెక్లెస్‌‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. అప్పర్‌‌ ట్యాంక్‌‌బండ్‌‌ నుంచి సచివాలయం వైపు వచ్చే వాహనాలను పాత అంబేడ్కర్‌‌ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి సచివాలయం వైపు కూడా సాధారణ వాహనాలను అనుమతించరు. 

అప్పర్‌‌ ట్యాంక్‌‌బండ్‌‌ నుంచి నల్లగుట్ట బ్రిడ్జి, నెక్లెస్‌‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను సోనాబీ అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్‌‌ రోడ్డు, కార్బాలా, రాణిగంజ్‌‌ మీదుగా మళ్లిస్తారు. రాణిగంజ్‌‌ నుంచి నెక్లెస్‌‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట ఎక్స్‌‌ రోడ్స్‌‌ వద్ద దారి మళ్లిస్తారు.