అమెరికానే కాకుండా ప్రపంచాన్ని షాకయ్యేలా చేసిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జరిపిన ప్రైవేట్ సమావేశాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఎప్స్టీన్తో బీజేపీ మంత్రి ఉన్న ఫొటోలు బయటికి రావడంతో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఆ సమావేశాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటంటూ ప్రతిపక్ష నేతలు నిలదీస్తుండటంతో ఢిల్లీ రాజకీయాల్లో హీట్ తారాస్థాయికి చేరుకుంటోంది.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) పార్టీల నేతలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ను తాను ఎప్పుడూ ఒంటరిగా కలవలేదని.. కేవలం ఒక ప్రతినిధి బృందంలో భాగంగానే కలిశానని మంత్రి పురీ గతంలో చెప్పారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఫొటోలపై మమతా బెనర్జీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఆ ఫొటోల్లో మిగిలిన ప్రతినిధులంతా టేబుల్ కింద దాక్కున్నారేమో అంటూ చురకలు అంటించారు. మంత్రి చెప్పిన మాటలకు బయటపడ్డ ఫొటోలకు పొంతన కుదరడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేథ్, ఎన్సీపీ నేత అనీష్ గవాండే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తదితరులు ఈ భేటీపై ప్రధాని మోడీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక దౌత్యవేత్త హోదాలో వ్యక్తి, బాధ్యత కలిగిన పొలిటీషియన్ ఇలాంటి నేరస్థుడిని కలవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. మోడీ ఎలాంటి వారిని తమ చుట్టూ ఉంచుకుంటారో దీనిబట్టి అర్థమవుతోందని విమర్శించారు.
అయితే ఈ వివాదంపై మంత్రి హర్దీప్ సింగ్ పురీ గతంలోనే స్పష్టతనిచ్చారు. 2017లో ఐక్యరాజ్యసమితి రాయబారి పదవికి రాజీనామా చేశాక, కేంద్ర మంత్రి కాకముందు.. అంతర్జాతీయ శాంతి సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగానే ఎప్స్టీన్ను మూడు, నాలుగు సార్లు కలిశానని చెప్పారు. ఆ పరిచయాలన్నీ కేవలం వృత్తిపరమైనవేనని, ఆయనపై ఉన్న ఆరోపణలతో వాటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మెుత్తానికి లీకైన ఫొటోల ఎపిసోడ్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
