దసరా పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర ప్రజలకు ఇది కాస్త చేదు వార్తే. పండుగ పూట కుటుంబంతో కలిసి బయట హోటల్, రెస్టారెంట్లలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇకపై జేబుకు మరింత చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్స్ తమ ఫుడ్ రేట్లు 10 నుంచి 15 శాతం మేర పెరగనున్నాయి. నిత్యావసర సరుకులు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, మరోవైపు ఎల్నినో ప్రభావం వంటి వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయోత్పత్తులపై పడుతున్న ప్రతికూల ప్రభావం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్(AHAR) అందించిన సమాచారం ప్రకారం.. మునుపెన్నడూ లేని విధంగా ముడిసరుకుల ధరలు, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల రేట్లు, షాప్ అద్దెలు, డైరీ ఉత్పత్తులు, పారిశుద్ధ్య ఖర్చులు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక రెస్టారెంట్ ఓనర్స్ మెనూ ధరలను సవరించాలని నిర్ణయించాయి. సాధారణంగా రూ.80 ఉండే ఇడ్లీ ధర ఇకపై రూ. 92 వరకు చేరనుండగా, రూ.90 ఉండే సాదా దోశ ధర సుమారు రూ.104 వరకు పెరగనుంది. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మొదలుకుని స్పెషల్ థాలీలు, డైన్-ఇన్ మీల్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్ల వరకు అన్నింటిపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.
ధరల పెరుగుదల పండగ వేళ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలని భావించే మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద షాకేనని చెప్పవచ్చు. దీపావళి అంటేనే పిండివంటలు, స్వీట్లు, కుటుంబ సభ్యులందరూ కలిసి హోటళ్లలో రుచికరమైన భోజనాలు ఆస్వాదించే ప్రత్యేక సమయం. కానీ ప్రస్తుత ధరల పెంపుతో ఫ్యామిలీస్ బయట ఫుడ్ తినడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారనుంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) పూణే చాప్టర్ హెడ్ సైలీ జహాగీర్దార్ మాట్లాడుతూ.. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఎక్సైజ్ ఫీజుల సవరణ కారణంగా ఆల్కహాల్ బేవరేజ్ ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
అయితే ఈ పెంపు అన్ని హోటళ్లలో ఒకేలా ఉండదు. రెస్టారెంట్ ఉన్న ప్రాంతం, దాని వ్యాపార విధానం, నిర్వహణ ఖర్చులను బట్టి ఆయా యాజమాన్యాలు ధరలను నిర్ణయించుకోనున్నాయి. ఫుడ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సర్వీస్ అందించేందుకు రేట్లు పెంచక తప్పట్లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం ఇదే విధంగా కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి దీపావళికి ఫ్యామిలీతో బయటికి వెళ్లేవారు మీ రెస్టారెంట్ బిల్లు మునుపటి కంటే కాస్త ఎక్కువే వస్తుందని తెలుసుకోండి.
