గడచిన 24 గంటల్లో సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. ఒకవైపు మిలియన్ల కొద్దీ వెబ్‌సైట్లను నడిపించే PHP సాఫ్ట్‌వేర్‌లో ప్రమాదకరమైన లోపాలు బయటపడగా.. మరోవైపు భారతీయ సంస్థ ఈముద్ర(eMudhra) భద్రతా కీస్‌లో తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయి. అక్టోబర్ నెలను 'సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్'గా జరుపుకుంటున్న తరుణంలోనే ఈ వరుస దాడులు, భద్రతా లోపాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అసలు గడిచిన రోజుల్లో సైబర్ ప్రపంచంలో ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వెబ్‌సైట్లకు ఆధారమైన 'పీహెచ్‌పీ' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో 2 అత్యంత కీలకమైన లోపాలు బయటపడ్డాయి. వీటిని PHP2Shell అని పిలుస్తున్నారు. ఈ లోపాల ద్వారా ఎలాంటి అనుమతి లేకుండానే హ్యాకర్లు నేరుగా వెబ్ సర్వర్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. దాదాపు 70 శాతం వెబ్‌సైట్లు పీహెచ్‌పీ పైనే ఆధారపడి ఉండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారింది. ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-5.6 సోల్ అనే ఏఐ మోడల్ ఈ లోపాలను గుర్తించింది. దీని తీవ్రతను గుర్తించిన అమెరికాకు చెందిన NSA, FBI సంస్థలు వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని, లేదంటే సర్వర్లను ఆఫ్‌లైన్ చేయాలని హెచ్చరించాయి. నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు ముందు జాగ్రత్తగా ఆఫ్‌లైన్‌కు వెళ్లాయి.
వెబ్‌సైట్లకు డిజిటల్ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రముఖ భారతీయ సంస్థ 'ఈముద్ర' భద్రతా వైఫల్యం బయటపడింది. వెబ్‌సైట్లు సురక్షితమైనవిగా చూపించే డిజిటల్ సర్టిఫికెట్ల కోసం ఈ సంస్థ అత్యంత బలహీనమైన ప్రైవేట్ కీస్‌ను ఉపయోగించినట్లు తేలింది. సాధారణంగా ఈ కీస్ చాలా క్లిష్టంగా ఉండి కంప్యూటర్లు కూడా సులభంగా ఊహించలేవు. అయితే ఈముద్ర కేవలం సింగిల్-బైట్ నంబర్లను (4, 56, 66 మొదలైనవి) మాత్రమే వాడటంతో.. కేవలం సెకను కంటే తక్కువ సమయంలోనే ఆ కీస్‌ను కనుగొన్నారు. దీనివల్ల హ్యాకర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అసలైన వెబ్‌సైట్లలా మోసం చేసే ప్రమాదం ఏర్పడింది. అయితే ఆపిల్, గూగుల్, మొజిల్లా వంటి సంస్థలు వెంటనే అప్రమత్తమై ఆ సర్టిఫికెట్లను బ్లాక్ చేశాయి.
జావాస్క్రిప్ట్ రన్ చేసే ఓపెన్‌సోర్స్ ప్రాజెక్ట్ అయిన 'నోడ్‌జేఎస్'లో 4 హై-సివియారిటీ లోపాలు బయటపడ్డాయి. హ్యాకర్లు రిమోట్‌గా కోడ్ రన్ చేసే అవకాశం ఉండటంతో యూజర్లు వెంటనే తమ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరించారు. అలాగే ఏఐ మోడళ్లకు రిక్వెస్ట్‌లను పంపే ఓపెన్‌సోర్స్ ప్రాక్సీ 'లైట్‌ఎల్‌ఎమ్' కూడా హ్యాకర్ల బారిన పడింది. ఇందులో హ్యాకర్లు మాల్‌వేర్‌ను చొప్పించి.. సిస్టమ్ సమాచారం, బ్రౌజర్ డేటా, డెవలపర్ సీక్రెట్స్, క్లౌడ్ క్రెడెన్షియల్స్‌ను తస్కరించే ప్రయత్నం చేశారు.
క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ 'రైల్వే' సిస్టమ్స్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు. కస్టమర్ల సెన్సిటివ్ డేటా, ఏపీఐ కీస్ వంటి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, యూజర్లు అందరూ వెంటనే తమ పాస్‌వర్డ్‌లు, కీస్‌ను మార్చుకోవాలని ఆ సంస్థ సూచించింది. మరోవైపు చైనాకు చెందిన 'స్టార్మ్-0940' అనే హ్యాకింగ్ గ్రూప్.. ARTEX అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగించి వందలాది కంపెనీలపై దాడులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. కనెక్ట్‌వైజ్ క్లౌడ్ బ్యాకప్ సేవలను టార్గెట్ చేసి వేలాది సిస్టమ్స్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
మొత్తానికి SBI కస్టమర్ల రికార్డులు లీక్ కావడం సహా వరుస సైబర్ దాడులు డిజిటల్ ప్రపంచంలో భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. డిజిటల్ యూజర్లు ఎప్పటికప్పుడు తమ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో ప్రస్తుత పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.
