ఎస్‌‌‌‌బీఐపై సైబర్ ఎటాక్.. డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌లో 3,897 మంది అకౌంట్ హోల్డర్ల వివరాలు

ఎస్‌‌‌‌బీఐపై సైబర్ ఎటాక్.. డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌లో 3,897 మంది అకౌంట్ హోల్డర్ల వివరాలు
  • డబ్బులు సురక్షితమని బ్యాంక్ ప్రకటన
  • 3.75 లక్షల రికార్డులను హ్యాక్ చేసిన సిరియసిమ్ గ్రూప్‌‌‌‌!

ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ) అకౌంట్ హోల్డర్ల  వ్యక్తిగత సమాచారం లీక్ కావడం కలకలం రేపుతోంది. మొత్తం 3,897 మంది వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటా డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌లో ఉన్నట్లు బ్యాంకు ఒప్పుకుంది కూడా. అయితే ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ యథావిధిగా, సేఫ్‌‌‌‌గా పనిచేస్తున్నాయని.. అకౌంట్ హోల్డర్ల డిపాజిట్లకు ఎలాంటి ఢోకా లేదని బుధవారం ప్రకటించింది.  

ఎస్‌‌‌‌బీఐకి చెందిన 3.75 లక్షల రికార్డులు, 2,722 పీడీఎఫ్‌‌‌‌లను హ్యాక్ చేసినట్లు 'సిరియసిమ్' అనే హ్యాకర్ ముఠా పేర్కొన్నట్లు సైబర్ నిఘా వర్గాలు ఈ నెల 16 న తెలిపాయి. ఇందులో వ్యక్తిగత సమాచారం, లోన్ దరఖాస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.   ఎస్‌‌‌‌బీఐ తాజాగా  స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన సమాచారం ప్రకారం.. డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా, అందులో 3,897 మంది అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత సమాచారం  ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

అక్టోబర్ 16న డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ (డీసీఏ), కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) హెచ్చరికలతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్‌‌‌‌బీఐ వెంటనే సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ మెకానిజాన్ని ప్రారంభించి,  ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ సంస్థతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. బాధితులకు సంబంధించిన పేర్లు, లింగం, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, ఈ–మెయిల్, చిరునామా, బ్రాంచ్ వివరాలు, సీఐఎఫ్ నంబర్లతో పాటు రుణాలకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్టు గుర్తించారు. 

అయితే అకౌంట్ హోల్డర్ల పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు, ఏటీఎం పిన్‌‌‌‌లు, ఓటీపీలు, బ్యాంకింగ్ లాగిన్ వివరాలు లీక్ కాలేదని, వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బు మాయం కాలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఘటన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఐటీ వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, మొత్తం డిపాజిట్లు సురక్షితమని భరోసా ఇచ్చింది.

అకౌంట్ హోల్డర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లీకైన సమాచారాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఎస్‌‌‌‌బీఐ అధికారులుగా నటిస్తూ ఫిషింగ్ కాల్స్ లేదా నకిలీ సందేశాలు పంపే అవకాశముందని బ్యాంక్ హెచ్చరించింది. ‘‘బ్యాంక్  ప్రతినిధులమని చెబుతూ ఫోన్లు చేసే గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, పిన్ నంబర్లు, వ్యక్తిగత పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా వీటిని అడగరు. అనుమానాస్పద లింకులు, ఈ–మెయిల్ అటాచ్‌‌‌‌మెంట్లను క్లిక్ చేయకూడదు. 

ఖాతా లావాదేవీల అలర్ట్‌‌‌‌లను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. లోన్ల వివరాల కోసం అధికారిక ఎస్‌‌‌‌బీఐ యాప్ లేదా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను మాత్రమే సంప్రదించాలి. క్రెడిట్ రిపోర్టులను తరచూ తనిఖీ చేసుకోవడం మంచిది. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు తెలియజేయడంతో పాటు సైబర్ హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in పోర్టల్‌‌‌‌లో ఫిర్యాదు చేయాలి”అని ఎస్‌‌‌‌బీఐ తమ అకౌంట్ హోల్డర్లకు సూచించింది. 

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌లో డేటా లీక్!

మరోవైపు  అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌లో సెన్సిటివ్ ఇన్‌‌‌‌ఫర్మేషన్  లీక్ అయినట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. కీలక విభాగాలను చూస్తున్న ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు సీక్రెట్‌‌‌‌గా బిజినెస్ స్ట్రాటజీలు,  మార్కెట్ సంబంధిత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు ఆధారాలు  దొరికాయని  సంబంధిత వర్గాలు తెలిపాయి. 

దీనిపై అంతర్గత సమీక్ష కొనసాగుతోందని, రిపోర్ట్‌‌‌‌ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ ప్రతినిధి  పేర్కొన్నారు. అక్టోబర్ 27న అనూప్ బాగ్చీ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ ఉదంతం బ్యాంక్‌‌‌‌కు సవాలుగా మారింది. ఇప్పటికే నాయకత్వ మార్పులు, విభేదాల నేపథ్యంలో ఈ ఏడాది బ్యాంక్ షేరు 28శాతం క్షీణించింది.