ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ: ఆటోబయోగ్రఫీ బుక్ ఫస్ట్ లుక్ విడుదల!

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ: ఆటోబయోగ్రఫీ బుక్ ఫస్ట్ లుక్ విడుదల!

సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. గురువారం ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించి.. తన తొలి పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇది ప్రేమ, బాధ్యత, నష్టం, జీవనంలో తనకంటూ ఒక స్థానాన్ని వెతుక్కోవడానికి సంబంధించిన కథ అని తెలిపారు. ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేలాది మంది ఆమెను ఫాలో అవ్వటం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ అధికారిక పేజీలను మాత్రమే ఫాలో అవుతున్నారు.

ఈ పుస్తకావిష్కరణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోనియా గాంధీ ఎంతో ఉత్సాహంగా తన 544 పేజీల జ్ఞాపకాల పుస్తకాన్ని అన్‌ప్రాప్ చేస్తూ కనిపించారు. పుస్తకం పేజీలు తిప్పుతూ.. తన పిల్లలు రాహుల్, ప్రియాంక చిన్ననాటి ఫోటోలను చూసి ముచ్చటపడ్డారు. "చాలా ఫోటోలు ఉన్నాయి ప్రియాంక" అంటూ ఆమె సంతోషంగా మాట్లాడడం వీడియోలో చూడవచ్చు. ఇది నవంబర్ 10న మార్కెట్లోకి రానుంది. ఇందులో ఆమె ఇటలీలోని బాల్య విశేషాలతో పాటు తన రాజకీయ ప్రయాణాన్ని పాఠకులతో పంచుకోనున్నారు.

అయితే ఈ పుస్తకం ప్రచురణ వెనుక పెద్ద వివాదమే నడిచింది. గత ఆగస్టులో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సంస్థతో సంపాదకీయ మార్పులపై వచ్చిన విభేదాల కారణంగా ఈ పుస్తకాన్ని ప్రచురించబోమని ప్రకటించింది. ప్రధాని మోడీ, ఆరెస్సెస్, భారత్-చైనా సంబంధాలకు సంబంధించిన కొన్ని అంశాలను తొలగించాలని పెంగ్విన్ కోరిందని.. ప్రభుత్వ ఒత్తిడి వల్లే వారు వెనక్కి తగ్గారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇది భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అని ఆరోపించింది.

అయితే తమపై ఎవరి ఒత్తిడి లేదని పెంగ్విన్ స్పష్టం చేసింది. ఈ పుస్తకాన్ని ప్రచురించాలని తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని 'హార్పర్‌కాలిన్స్ ఇండియా' ప్రచురిస్తుండగా.. గ్లోబల్ పబ్లిషర్‌గా మాత్రం పెంగ్విన్ రాండమ్ హౌస్‌కు చెందిన అమెరికన్ సంస్థ 'ఆల్ఫ్రెడ్ ఎ. నాప్ఫ్' వ్యవహరిస్తోంది. మొత్తానికి సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ, ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ బయటకు రానుండటం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.