Rare Medical Case: వైద్య ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అత్యంత వింతైన, అరుదైన ఘటన ఒకటి భారతదేశంలో వెలుగు చూసింది. సాధారణంగా నోటిలో పెరగాల్సిన పన్ను, ఏకంగా ఓ 16 ఏళ్ల బాలుడి కంటి (Eye Socket) లోపల పెరగడం వైద్యులను విస్మయానికి గురిచేసింది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి కేసు నమోదవకపోవడం గమనార్హం. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (American Academy of Ophthalmology) జర్నల్ ప్రచురించింది.
ఎడమ కంటి పై పన్ను:
16 ఏళ్ల కుర్రాడు తన ఎడమ కంటి పైన స్వల్పంగా నొప్పితో కూడిన వాపు రావడంతో వైద్యులను సంప్రదించాడు. ప్రారంభంలో అది సాధారణ కంటి సమస్యగా భావించినప్పటికీ, కొద్ది రోజుల్లోనే కనురెప్ప, కనుబొమ్మల మధ్య భాగం నుంచి రెండు తెల్లటి పళ్లు బయటకు రావడం మొదలైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వైద్యులు, బాలుడికి సీటీ స్కాన్ (CT Scan) నిర్వహించారు. ఆ నివేదికలను చూసి డాక్టర్లు నోరెళ్లబెట్టారు. బాలుడి ఎడమ కంటి ఎగువ భాగంలో (Superior Orbit) పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న ఒక పన్ను ఎదుగుతున్నట్లు తేలింది.
ఏమిటీ ఎక్టోపిక్ టూత్:
నోటి భాగంలో కాకుండా శరీరంలో ఇతర అసాధారణ ప్రదేశాల్లో పళ్లు పెరగడాన్ని వైద్య పరిభాషలో ఎక్టోపిక్ టూత్ (Ectopic Tooth) అని పిలుస్తారు. ముక్కు రంధ్రాలు, నోటి పైకప్పు (Palate) ప్రాంతాల్లో అప్పుడప్పుడు అదనపు పళ్లు పెరగడం కొన్ని కేసుల్లో కనిపిస్తుంది. అయితే, కంటి ఎగువ భాగంలో (Superior Orbit) ఇలా పన్ను పెరగడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటి కేసు అని కేస్ స్టడీ సహ రచయిత డాక్టర్ మేఘనా తన్వార్ స్పష్టం చేశారు.
జెనెటిక్ లోపాలు లేనట్లే:
సాధారణంగా ముఖానికి తీవ్ర గాయాలవ్వడం వల్ల లేదా జన్యుపరమైన లోపాల (Genetic Disorders) వల్ల ఇలాంటి అరుదైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ కుర్రాడికి ఎలాంటి పాత గాయాలు లేదా కుటుంబ జన్యు లోపాలు లేకపోవడం విశేషం. శరీరంలో ఎక్కడా అదనపు పళ్లు లేవని, కేవలం ప్రమాదవశాత్తు (Pure Chance) కంటి భాగంలో ఈ ఒక్క పన్నుయ ఏర్పడిందని వైద్యులు వెల్లడించారు.
సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్:
కంటి చూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స (Surgery) చేసి, ఆ పన్నును సురక్షితంగా తొలగించారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకున్నాడని, భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రావని డాక్టర్లు పేర్కొన్నారు. ఇది మాకే కాదు, ప్రపంచ వైద్య రంగానికే ఒక వింత అనుభవం అని డాక్టర్ తన్వార్ పేర్కొన్నారు.
