తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు, క్లినిక్ లపై టీజీసేఫ్ అధికారులు దాడు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మందులు, నిషేధిత మందులను సీజ్ చేస్తున్నారు. అర్హత లేకుండా ప్రాక్టిస్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ ఎంపీ గుర్తించి చర్యలు చేపడుతున్నారు. గురువారం (సెప్టెంబర్ 10) జనగామ జిల్లా యర్రగొల్లపహాడ్ లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై టీజీ సేఫ్ వింగ్ దాడులు చేసింది. 2లక్షల విలువైన పలు రకాల మందులను సీజ్ చేసింది.
పన్నేరు రమేష్ అనే వ్యక్తి అర్హత లేకుండానే క్లినిక్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. క్లినిక్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 రకాల మందులను సీజ్ చేశారు. యాంటిబయోటిక్స్ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వంటి వివిధ రకాల మందులను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మెడిసిన్ విలువ రూ. 2.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
అవగాహన లేకుండా స్టెరాయిడ్స్ దుర్వినియోగంతో హార్మునల్ సమస్యలు, ఇమ్మూనిటీ తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మందుల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు. దర్యాప్తు అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
