కాన్పూర్ వ్యాపారి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఫార్మా సూటికల్ వ్యాపారి మినోచా హత్య కేసులో కోడలే కీలక సూత్రదారి అని తేల్చారు. తన జల్సాలకు అడ్డుపడుతున్నాడని.. ఏకంగా భర్త తండ్రికి.. అంటే మామకు స్పాట్ పెట్టింది కోడలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
మినోచా హత్య కేసులో ఆయన కోడలు షాలూ, ఆమె భర్త సుబ్రత్, మాజీ ఇంటి సేవకుడు విశాల్ గౌతమ్ మధ్య హత్యకు ముందు 21 రోజుల్లో 330 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని కాల్ రికార్డుల ద్వారా బయటపడింది.
వీటిలో షాలూ సుమారు 30 కాల్స్ చేసినట్లు, సుబ్రత్ దాదాపు 300 కాల్స్ చేసినట్లు తేలింది. హత్య జరిగిన రోజు అంటే 2026 సెప్టెంబర్ 5న షాలూ, విశాల్ మధ్య 14 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. డిజిటల్ ఎవిడెన్స్ లేకుండా చేసేందుకు విశాల్ చాట్‌లను తొలగించినా, వాట్సాప్ కాల్ రికార్డులు పోలీసులకు దొరికటంతో అసలు విషయం బయటపడింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, షాలూ సుమారు మూడు నెలల నుంచి మామను లేపేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆమె విశాల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని.. అతన్ని పొగుడుతూ.. అతని రిలేషన్స్ గురించి అడుగుతూ తన దారిలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత తన మామను లేపేసేందుకు విశాల్ ను 6 లక్షల రూపాయలకు ఒప్పించింది. ఇంటికి సంబంధించి అసలు కీ ఇచ్చి డూప్లికేట్ తయారు చేయించింది. తాను, భర్త, కొడుకు ఇంట్లో లేనప్పుడు మామను లేపేయాల్సిందిగా సమాచారం ఇచ్చింది.
మినోచాను చంపేందుకు విశాల్ తన ఫ్రెండ్ రాజ్ కిషోర్ (30)ను తీసుకుని అపార్ట్మెంట్ కు చేరుకున్నాడు. సెప్టెంబర్ 5న వారు మెడిసిన్ డెలివరీ బాయ్స్ గా సెక్యూరిటీని నమ్మించి ఫ్లాట్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో దాక్కుని, మినోచాను ఊపిరాడకుండా చేసి గుండెపోటుగా చూపించాలని ప్లాన్ వేశారు. కానీ మినోచా రాత్రి 10.55 గంటల సమయంలో ఇంటికి వచ్చిన మినోచా.. వాళ్లను గమనించడంతో ప్లాన్ అంతా బయటపడింది. దీంతో ప్లాన్ మార్చి నేరుగా అటాక్ చేశారు. 26 సార్లు కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసి పారిపోయారు.
సెప్టెంబర్ 6న ఎన్‌కౌంటర్ తర్వాత విశాల్, రాజ్ కిషోర్‌లను అరెస్టు చేశారు. తర్వాతి రాత్రి షాలూను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మినోచా కొడుకు, షాలూ భర్త సుబ్రత్ పాత్రపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
