సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాద ఘటన జరిగింది. భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన ఈ ఘటనతో లాలాగూడ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ముందుగా విజయపురి కాలనీలో భార్య లక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె భర్త చరణప్ప నిద్రలేచి చూసేసరికి భార్య మృతదేహం కనిపించడంతో భయంతో ఇంట్లో నుంచి పరుగులు పెట్టాడు. యంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన చరణప్ప లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నర క్రితమే చరణప్ప, లక్ష్మికి వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
చరణప్ప నాచారంలో ఫుట్‌పాత్‌పై టీ స్టాల్ నిర్వహిస్తుండగా భార్య లక్ష్మీ గృహిణి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన లాలాగూడ, సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలపై ఆరా తీస్తున్నారు.
పోస్ట్ మార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు.
