AI రీసెర్చ్ కోసం అమెరికాలో రూ.191 కోట్లు డొనేట్ చేసిన తెలుగు కపుల్!

AI రీసెర్చ్ కోసం అమెరికాలో రూ.191 కోట్లు డొనేట్ చేసిన తెలుగు కపుల్!

అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ కు తెలుగు కపుల్ అనురాధ, వికాస్ సిన్హా రూ.191 కోట్ల డొనేట్ చేశారు. ఎలాంటి పన్ను మినహాయింపుల ఉద్దేశం లేకుండా.. విద్య ద్వారా తాము పొందిన అవకాశాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు విద్య నేర్పిన వర్సిటీకి ఆర్థిక సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఎస్వీ యూనివర్సిటీలో ఈ దంపతులు తమ సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీలను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లడంతో వారి జీవితం కొత్త మలుపు తిరిగింది.

అమెరికాకు వెళ్లిన తర్వాత ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన వికాస్ సిన్హా, ఆ తర్వాత నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో చదివారు. ఆపై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో పీహెచ్‌డీ పూర్తి చేసి 2023లో డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ టెక్ దిగ్గజం బ్రాడ్‌కామ్ కంపెనీలో మెయిన్‌ఫ్రేమ్ సాఫ్ట్‌వేర్ బిజినెస్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అత్యున్నత హోదాలో రాణిస్తున్నారు. 

ఈ భారీ విరాళంతో యూనివర్సిటీలో సరికొత్తగా "అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్" అనే పేరుతో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటవుతోంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలన్నీ ఈ కొత్త కళాశాల కిందకు రానున్నాయి. ఈ విరాళం కేవలం భవనాల నిర్మాణానికే కాకుండా.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రొఫెసర్‌షిప్‌లు, రీసెర్చ్ కోసం ఏకంగా 6 శాశ్వత ఎండోమెంట్‌లను ఏర్పాటు చేయడానికి పూర్తిగా ఉపయోగపడనుంది.

గతంలో కూడా ఈ దంపతులు UNT యూనివర్సిటీలోని డేటా సైన్స్ విభాగాల అభివృద్ధికి సహాయం అందించారు. 2024లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, తర్వాతి సంవత్సరమే మరో 2.15 మిలియన్ డాలర్లతో సిన్హా డేటా సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను స్థాపించారు. ఇప్పుడు తాజా విరాళంతో ఆ సేవలను మరింత విస్తృతం చేశారు.

ఒక సాధారణ విద్యార్థిగా ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన వికాస్ సిన్హా, దశాబ్దాల తర్వాత అదే దేశంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తిరిగి యూనివర్సిటీకి ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం స్ఫూర్తిదాయకం. ఇమ్మిగ్రేషన్స్ అమెరికన్ డ్రీమ్‌ను కేవలం వినియోగించుకోవడమే కాకుండా.. దాని నిర్మాణంలో ఎలా భాగస్వాములు కావచ్చో ఈ తెలుగు కపుల్ ఆచరణ ద్వారా నిరూపించారు.