తల్లి కాళ్లు మొక్కి.. ఆశీర్వాదం తీసుకుని రా : కొడుకు ఆస్తి కేసుపై సుప్రీం చివాట్లు

తల్లి కాళ్లు మొక్కి.. ఆశీర్వాదం తీసుకుని రా : కొడుకు ఆస్తి కేసుపై సుప్రీం చివాట్లు

సొంత కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లో కొడుకును నమ్మి ఉండనిస్తే, ఆ ఆస్తిపైనే నకిలీ పేపర్లతో  కన్నేసిన  కొడుకుకి అత్యున్నత నాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రుల ఆస్తి వివాదంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన కొడుకు పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా, కన్నతల్లి కాళ్లకు మొక్కి క్షమాపణలు కోరాలని ధర్మాసనం ఘాటుగా బుద్ధి చెప్పింది.
 
 వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఓ దంపతులు వాళ్ళ  సొంత కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకున్నారు. కన్నపేగుపై ఉన్న ప్రేమతో, ఎటువంటి అద్దె తీసుకోకుండా  కొడుకు, కోడలిని ఆ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉండడానికి  ఒప్పుకున్నారు. అయితే.. ఆ కొడుకు, అతని భార్య నకిలీ  ఇంటి పేపర్లు  సృష్టించి, ఆ ఆస్తి మాదేనంటూ హక్కులు కోరడం ప్రారంభించారు. దీంతో తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

దిగువ కోర్టు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు రెండూ తల్లిదండ్రులకే అనుకూలంగా తీర్పునిచ్చాయి. దీనిని సవాలు చేస్తూ కొడుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం:
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కొడుకు చేసిన పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, అతడు చేసిన అప్పీలును కొట్టిపారేసింది.

కోర్టు గదిలో జస్టిస్ శర్మ మాట్లాడుతూ "ఈ అబ్బాయి చేసిన ప్రవర్తన ముమ్మాటికీ తప్పే కదా ? ఇతను వెంటనే తన తల్లి వద్దకు వెళ్లి, ఆమె కాళ్లను తాకి, తాను చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి, ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని కోర్టు కోరుకుంటోంది" అని స్పష్టం చేశారు.

కోర్ట్ ఆదేశాలు
 * 60 రోజుల్లోగా తల్లిదండ్రుల ఇంటిని ఖాళీ చేయాలని కొడుకును ఆదేశించింది.
*తల్లిదండ్రులకు జరిగిన  నష్టానికి పరిహారం కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
*భారతీయ సమాజంలోనూ, హిందూ మతంతో సహా అన్ని మతాలలోనూ కన్నతల్లికి అత్యున్నత స్థానం ఉందని గుర్తు చేస్తూ.. ఆస్తి కోసం కన్నవారిని వేధించే పిల్లల దుర్మార్గమైన ప్రవర్తనను చట్టం ఎప్పటికీ రక్షించదని తెగేసి చెప్పింది.