లాభాల్లో ఉన్న ఐడీబీఐని  ఎందుకు అమ్ముతున్నరు: రాహుల్ గాంధీ

లాభాల్లో ఉన్న ఐడీబీఐని  ఎందుకు అమ్ముతున్నరు: రాహుల్ గాంధీ
  • కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
  • బ్యాంకు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే రిజర్వేషన్లు పోతాయ్
  • ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసిన ప్రతిపక్ష నేత
  • కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుకు నష్టాలు: నిర్మల

 

న్యూఢిల్లీ: లాభాల్లో నడుస్తున్న ఐడీబీఐ బ్యాంకును కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బ్యాంకు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించవని, ఉద్యోగుల సర్వీస్ కండిషన్లకు ఇప్పుడున్న రక్షణ ఉండదని అన్నారు. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులను ఉద్దేశించి  ఆయన బహిరంగ లేఖ రాశారు. గతేడాది మార్చిలో పార్లమెంట్ హౌస్‌‌‌‌‌‌‌‌లో కొందరు బ్యాంకు ఉద్యోగులు తనను కలిశారని, తాము కష్టపడి లాభాల్లోకి తెచ్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని అడిగారని లేఖలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని లోక్‌‌‌‌‌‌‌‌సభలో లేవనెత్తానని, ఉద్యోగులు, డిపాజిటర్ల ప్రయోజనాలను ఎలా కాపాడుతారని ప్రశ్నించానని చెప్పారు.ఏడేండ్ల కింద నష్టాల్లో ఉన్న ఐడీబీఐ.. గతేడాది రూ.9 వేల కోట్లకు పైగా లాభం సాధించిందని, ఆ ఘనత ఉద్యోగులదేనని రాహుల్ అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన బ్యాంకు ప్రజలదేనన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీ కలిపి బ్యాంకులో 95 శాతం వాటా కలిగి ఉన్నాయని, ఈ డీల్ తర్వాత అది 34 శాతానికి తగ్గుతుందని చెప్పారు. ఐడీబీఐలో కనీసం 50 శాతం వాటా ప్రభుత్వం దగ్గరే ఉంటుందని 2003లో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ బ్యాంకులు దేశ నిర్మాణానికి తోడ్పడే సంస్థలని, వాటిని అమ్ముకునే ఆస్తులుగా చూడొద్దన్నారు. దేశ పారిశ్రామిక వృద్ధి కోసం కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను స్థాపిస్తే, ఇప్పటి ప్రభుత్వం వాటిని అమ్ముతోందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఐడీబీఐ ఉద్యోగులకు, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌‌‌‌‌‌‌‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌కు సుమారు రూ.53 వేల కోట్లకు అమ్మేందుకు అక్టోబర్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కాంగ్రెస్ నేతల సన్నిహితులకే లోన్లు: నిర్మల

రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బ్యాంకులను, ఆర్థిక సంస్థలను తన సొంత సంస్థల్లా కాంగ్రెస్ వాడుకుందని, నిబంధనలు పాటించకుండా లోన్లు ఇవ్వాలని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్న వీడియోకాన్, విన్‌‌‌‌‌‌‌‌సమ్, ఏబీజీ షిప్‌‌‌‌‌‌‌‌యార్డ్, కింగ్‌‌‌‌‌‌‌‌ఫిషర్ వంటి పెద్ద కంపెనీలకు లోన్లు ఇచ్చేలా ఐడీబీఐపై ఒత్తిడి తెచ్చారని, అవి మొండి బకాయిలుగా మారి బ్యాంకుకు భారీ నష్టం వచ్చిందని చెప్పారు. బ్యాంకు ఆర్థికంగా దెబ్బతిన్న స్థితిలో ఎన్డీయే ప్రభుత్వం చేతికి వచ్చిందని, ప్రొఫెషనల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, జాగ్రత్తైన లెండింగ్ విధానాలు, రూ.25 వేల కోట్లకు పైగా మూలధన సాయంతో దాన్ని తిరిగి నిలబెట్టామని తెలిపారు.