చార్‌‌ధామ్ రూట్‌‌లో కుప్ప కూలిన  హెలికాప్టర్

చార్‌‌ధామ్ రూట్‌‌లో కుప్ప కూలిన  హెలికాప్టర్
  • జోషిమఠ్ దగ్గర కొండను ఢీకొని క్రాష్
  • పైలట్ సహా ఆరుగురు దుర్మరణం
  • మృతుల్లో బెంగళూరు సీసీబీ ఇన్‌‌స్పెక్టర్
  • వర్షం, దట్టమైన మబ్బులే కారణం
  • ట్రాన్స్ భారత్ హెలికాప్టర్లన్నీ నిలిపివేత
  •  

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని చార్‌‌‌‌‌‌‌‌ధామ్ యాత్ర మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్న హెలికాప్టర్ శుక్రవారం జోషిమఠ్ దగ్గర కొండను ఢీకొని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ కెప్టెన్ హిమాన్షుతో పాటు ప్రతాప్, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్, హెచ్ఎస్ నటరాజ్ అనే ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. ప్రయాణికులంతా బెంగళూరుకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో అరుణ్ సాలుంకే బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)లో ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. ఆయన నలుగురు స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్లారు. ఓవైపు వర్షం, మరోవైపు దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే చమోలి జిల్లా యంత్రాంగం, పోలీసులు,  ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేపట్టారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఆయన, మృతదేహాలను వీలైనంత త్వరగా ఎయిర్‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

గంటలోనే సిగ్నల్ కట్

ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) వివరాలు వెల్లడించింది. ‘ట్రాన్స్ భారత్ ఏవియేషన్’ సంస్థకు చెందిన హెలికాప్టర్ శుక్రవారం మధ్యాహ్నం 1:15 గంటలకు బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని సహస్రధారకు బయల్దేరింది. సుమారు గంట తర్వాత, 2:20 గంటలకు జోషిమఠ్ లోయ మీదుగా వెళ్తుండగా హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అందులోని ట్రాకింగ్ సిస్టమ్ కూడా పనిచేయకపోవడంతో జాడ దొరకలేదు. వాతావరణం అనుకూలించిన వెంటనే గాలింపు చేపట్టి జోషిమఠ్ దగ్గరి మార్వాడీ బ్రిడ్జి సమీపంలోని కొండపై హెలికాప్టర్ కూలిపోయినట్లు గుర్తించారు. శిథిలాల కోసం మరో రెండు హెలికాప్టర్లు, డ్రోన్లతో గాలించారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ బృందం ఆరుగురు చనిపోయినట్లు నిర్ధారించింది. దీంతో ముందుజాగ్రత్తగా ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌‌‌‌‌‌‌‌కు చెందిన అన్ని హెలికాప్టర్ల రాకపోకలను అధికారులు నిలిపేశారు.

పదేండ్లలో 9 ప్రమాదాలు

చార్‌‌‌‌‌‌‌‌ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేండ్లుగా ఈ రూట్‌‌‌‌‌‌‌‌లో యాత్రికుల హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నివేదిక ప్రకారం 2015 నుంచి 2025 మధ్య చార్‌‌‌‌‌‌‌‌ధామ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సుమారు 9 ప్రమాదాలు జరిగాయి. 2022 నుంచి ఏటా కనీసం ఒక ఘోర ప్రమాదం జరుగుతూనే ఉంది. గతేడాది ఒక్క ఏడాదే నాలుగు ప్రమాదాలు జరిగాయి. 2017లో బద్రీనాథ్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీర్ చనిపోగా, 2022లో కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ నుంచి వస్తున్న హెలికాప్టర్ కూలి పైలట్‌‌‌‌‌‌‌‌తో సహా ఏడుగురు మృతి చెందారు. గతేడాది మే, జూన్ నెలల్లో గంగ్నానీ, కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ దగ్గర జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, దట్టమైన మబ్బులు, విజిబిలిటీ తక్కువగా ఉండడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఏఏఐబీ తెలిపింది.