మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా పరిచయమైన సినిమా ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఇవాళ గురువారం (సెప్టెంబర్ 10, 2026న) సినిమా థియేటర్లలో విడుదలైంది. పల్లెటూరి ఆచారాలు, జంతుబలులు, మూఢనమ్మకాలు మరియు దైవభక్తి నేపథ్యంలో సాగే ఈ కథ.. ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథేంటంటే?
వరంగల్ ప్రాంతంలోని మహిషాపురం గ్రామంలో వరదలు, అంటువ్యాధులు వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో గ్రామస్తులకు మారెమ్మ తల్లి విగ్రహం దొరకడంతో దాన్ని గ్రామదేవతగా భావించి పూజలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఊరి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి.
అదే సమయంలో గ్రామంలోని ఒంటికన్ను పూజారి ఓ ప్రత్యేకమైన దున్నపోతు పుడుతుందని చెబుతాడు. దాన్ని పదేళ్ల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో పెంచి, ఆ తర్వాత అమ్మవారికి బలిగా ఇవ్వాలని సూచిస్తాడు. ఆ బాధ్యత కర్ణి (మాధవ్ భూపతిరాజు)కి అప్పగిస్తారు. ఆ దున్నపోతుకు ‘మారెమ్మ’ అని పేరు పెడతారు.
కర్ణి చిన్నప్పటి నుంచి ఆ మూగజీవితో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. అయితే ఓ దశలో ఆ పవిత్రమైన దున్నపోతు అనూహ్యంగా కనిపించకుండా పోతుంది. దాని తర్వాత ఊరిలో వరుసగా కొన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయి. దీంతో ఎలాగైనా మారెమ్మను వెతికి తీసుకురావాలని కర్ణి నిర్ణయించుకుంటాడు. ఆ శోధనలో కర్ణికి ఎదురైన రక్తసిక్తమైన సవాళ్లు, స్థానిక ముఠాల పగ, ఊరి మూఢనమ్మకాలు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
గ్రామీణ నేపథ్యం, గ్రామదేవత నమ్మకాలు, జంతుబలి, మూఢనమ్మకాలు వంటి అంశాలతో ‘మారెమ్మ’ కథను దర్శకుడు మంచాల నాగరాజ్ ఆసక్తికరంగా మొదలుపెట్టారు. ముఖ్యంగా మారెమ్మ అనే దున్నపోతు చుట్టూ కథను నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. కర్ణి, ఆ మూగజీవి మధ్య అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం కూడా ఆకట్టుకుంటుంది.
అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ స్క్రీన్‌ప్లే కొంత నెమ్మదిస్తుంది. మారెమ్మ అదృశ్యమైన తర్వాత దాన్ని వెతికే సన్నివేశాల్లో ఉత్కంఠను మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. జంతుబలి, దైవభక్తి, మూఢనమ్మకాలపై సినిమా చెప్పాలనుకున్న పాయింట్ కూడా క్లారిటీగా ఎస్టాబ్లిష్ కాలేదని ఫీలింగ్ ఇస్తుంది.
మరోవైపు క్షుద్రపూజలు, స్థానిక ముఠాల పగ, గ్రామీణ వాతావరణం కథకు మాస్ టచ్ తీసుకొచ్చాయి. కొత్త హీరో మాధవ్ భూపతిరాజు తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్, ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. అయితే మరింత బిగువైన ఎడిటింగ్, పటిష్టమైన స్క్రీన్‌ప్లే ఉంటే ‘మారెమ్మ’ మరింత ప్రభావవంతమైన రూరల్ యాక్షన్ డ్రామాగా నిలిచేది.
నటీనటుల పనితీరు:
మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. కర్ణి పాత్రలో గ్రామీణ యువకుడిగా సహజమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా మారెమ్మతో కలిసి వచ్చే సన్నివేశాల్లో అతడి నటనలో ఎమోషన్ కనిపిస్తుంది. యాక్షన్ సీన్లలోనూ ఎనర్జీ చూపించాడు. తొలి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దీపా బాలు హీరోయిన్‌గా తన పాత్ర పరిధిలో మెప్పించింది. కథలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా, మాధవ్‌తో వచ్చే సన్నివేశాల్లో కెమిస్ట్రీ బాగానే అనిపిస్తుంది. వికాస్ వశిష్ట జలేంధర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. పాత్రలోని కఠినత్వం, ప్రతీకార భావనను తన నటనతో బాగా చూపించాడు. వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మీ, దయానంద్ రెడ్డి తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ టీమ్:
ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి పల్లెటూరి వాతావరణాన్ని, తెలంగాణ గ్రామీణ జీవనశైలిని సహజంగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో విజువల్స్ ఆకట్టుకుంటాయి.
ఎడిటింగ్ విషయంలో మాత్రం మరింత క్రిస్ప్‌నెస్ అవసరమనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. దర్శకుడు మంచాల నాగరాజ్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, దాన్ని మరింత బలమైన స్క్రీన్‌ప్లేతో, ఆసక్తికరమైన టేకింగ్‌తో తెరకెక్కించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.
