నేను కూడా ఒక మనిషినే.. రాబందుల కన్నా దారుణంగా పొడుచుకు తింటారా? రాజకుమారి ఎమోషనల్ పోస్ట్!

నేను కూడా ఒక మనిషినే.. రాబందుల కన్నా దారుణంగా పొడుచుకు తింటారా?  రాజకుమారి ఎమోషనల్ పోస్ట్!

బిగ్‌బాస్ పేరు వినిపిస్తే చాలు.. కంటెస్టెంట్ల ఆట, వివాదాలు, ఎమోషన్స్, ఎలిమినేషన్స్ గురించి సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు అదే హీట్‌కు మరో ఎమోషనల్ ట్విస్ట్ జతైంది. బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరుతో కాదు.. తనపై వస్తున్న ట్రోలింగ్‌పై కన్నీళ్లతో స్పందించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.

అగ్ని పరీక్షలో కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన రాజకుమారి దయాన తన కాన్ఫిడెన్స్, మాటతీరు, తెగువతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడిన విధానం జడ్జీలతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో ఆమెకు 'బిగ్‌బాస్ తెలుగు సీజన్10' మెయిన్ హౌస్‌లో ఛాన్స్ దక్కడం ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు ఆ అవకాశం దక్కకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు.

 

ఇదిలా ఉండగా, హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు ఊహించని రీతిలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది. బిగ్‌బాస్‌లో అవకాశం పొందడం కోసమే ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, కష్టాలను బయటపెట్టిందని, ఆమె ఒక 'సింపతీ స్టార్' అంటూ కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శలపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఒక కన్నీటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన బాధను వెళ్లగక్కారు.

లేటెస్ట్ గా తన పిల్లలతో ఉన్న ఓ ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాజకుమారి.. 'నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. 'సంపతీ స్టార్..  సంపతీ స్టార్ ' అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

'బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా..  నేను కూడా ఒక మనిషినే.. నాకూ బాధ ఉంటుంది.. నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టకపోయినా.. రాజకుమారి దయాన పేరు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది.