శాసనమండలిలో బీఆర్ఎస్ వాకౌట్

శాసనమండలిలో బీఆర్ఎస్ వాకౌట్
  •  ..22ఏ నిషేధిత భూములపై చర్చకు పట్టు
  • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్
  • మండలిలో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ సభ్యులు
  • చైర్మన్ పోడియం వైపు వెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న మార్షల్స్
  • ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదన్న ప్రతిపక్ష నేత
  • బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై చైర్మన్ గుత్తా ఫైర్

 హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను చేపట్టడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించడంతో వారు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. పలుమార్లు చైర్మన్ పోడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పలుమార్లు సూచించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. కొందరు కాగితాలను చించి విసిరేశారు. మరోవైపు ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర సభ్యులు ప్రశ్నలు అడగడం, మంత్రులు సమాధానాలు ఇవ్వడం కొనసాగింది.

అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు, పాటలతో తమ నిరసనను కొనసాగించారు. తమ శాసనసభా పక్షనేత మధుసూదనాచారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. ప్రశ్నోత్తరాల అంశాలపై మాట్లాడితే అవకాశం ఇస్తామని చైర్మన్ స్పష్టం చేశారు. అయితే 22ఏ నిషేధిత భూములపై చర్చకు అనుమతించాలని మధుసూదనాచారి పట్టుబట్టారు. ముందుగా ప్రశ్నోత్తరాలను పూర్తి చేసి, ఆ తర్వాత వాయిదా తీర్మానంపై మాట్లాడుదామని చైర్మన్ సూచించారు. ఇందుకు బీఆర్ఎస్ అంగీకరించలేదు.

బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై చైర్మన్ గుత్తా ఫైర్

బీఆర్ఎస్ సభ్యుల నిరసనను విరమింపజేసేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రయత్నించారు. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వారిపై ఫైర్ అయ్యారు. తాను, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీలుగా పార్లమెంటులో తెలంగాణ కోసం నినదించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.

చైర్మన్ సూచనలతో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలను ఆపివేసినప్పటికీ.. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ నిరసన కొనసాగించారు. చివరకు ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మధుసూదనాచారి వాకౌట్ ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు.