ఓపెన్ పేజీ : మట్టి గణపతి తయారీలో సర్క్యులర్ ఎకానమీ..పర్యావరణాన్ని కాపాడదాం..ధ్వని కాలుష్యాన్ని అరికడదాం

ఓపెన్ పేజీ : మట్టి గణపతి తయారీలో  సర్క్యులర్ ఎకానమీ..పర్యావరణాన్ని కాపాడదాం..ధ్వని కాలుష్యాన్ని అరికడదాం

సర్క్యులర్ ఎకానమీ అనేది వ్యర్థాలను తగ్గించి, వనరులను నిరంతరం పునర్వినియోగించే ఒక స్థిరమైన ఆర్థిక నమూనా.  ప్రస్తుతం  కార్పొరేట్ సంస్థలు అనుసరించే సర్క్యులర్ ఎకానమీ అనే భావన పురాతన కాలంలోనే మట్టి వినాయకుణ్ని పూజించే సంప్రదాయంలో ఇమిడి ఉన్నది.

 ఉదాహరణకు  ఎలక్ట్రానిక్  వస్తువుల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆపిల్ సంస్థ 2030  
సంవత్సరం వరకు  కార్బన్  న్యూట్రాలిటీ  లక్ష్యాన్ని సాధించటం కోసం,  సహజ వనరులు దుర్వినియోగం  కాకుండా,  ఆర్థికభారం తగ్గించుకోవడం  కోసం  సర్క్యులర్  ఎకానమీ విధానాలను అమలుచేస్తున్నది.  

 సర్క్యులర్ ఎకానమీ ప్రధాన అంశాలు

తగ్గించడం (రెడ్యూస్‌‌‌‌‌‌‌‌),  పునర్వినియోగం (రీయూజ్‌‌‌‌‌‌‌‌),   రీసైకిల్ అనేవి  సర్క్యులర్  ఎకానమీ ప్రధాన అంశాలు.  తగ్గించడం అంటే  అనవసరంగా వస్తువుల వినియోగాన్ని,  కొనుగోళ్లను తగ్గించడం వలన సహజ వనరుల వినియోగం  తగ్గుతుంది.  తద్వారా  కొత్త ముడి పదార్థాల డిమాండ్ తగ్గుతుంది.  

పునర్వినియోగం  అనగా వస్తువులను దాని అసలురూపంలో  మళ్లీ మళ్లీ ఉపయోగించడం.   ప్రతిరోజూ  వంటకోసం వాడే వంట సామాన్లు, స్టీల్ గ్లాసులు, స్టీలు పళ్లాలు వంటివి దీనికి ఉదాహరణలు. వాడకానికి  పనికిరాని పాత వస్తువులను  ప్రాసెస్ చేసి వాటి నుంచి తిరిగి  కొత్త వస్తువులను  తయారు చేయటం. 
   
చెరువు నుంచి సేకరించిన మట్టిని వినియోగించి మట్టి గణపతిని తయారుచేసి పూజించిన తర్వాత ఆ మట్టి విగ్రహాన్ని తిరిగి  చెరువులో నిమజ్జనం చేస్తారు. అప్పుడు  నీటిలో  మట్టివిగ్రహం పూర్తిగా కరిగిపోతుంది. మరుసటి  సంవత్సరం  కూడా చెరువు నుంచి సేకరించిన మట్టినుంచే  తిరిగి మట్టి గణపతిని తయారుచేసి పూజించడం   అనాదిగా వస్తున్న సంప్రదాయం.  ఈ  పద్ధతిలో ‘రిసైకిల్’  అనే సర్క్యులర్  ఎకానమీ భావన  స్పష్టంగా కనిపిస్తుంది.  

ఆర్థిక భారాన్ని పెంచే లీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ

 సర్క్యులర్ ఎకానమీ భావన పద్ధతిలో నీటిలో ఎటువంటి వ్యర్ధాలు మిగలవు,  సహజ వనరుల దుర్వినియోగం,  జల కాలుష్యం జరగదు.  అంటే  మన పూర్వీకులు  శాస్త్ర, సాంకేతిక రంగాలలో అంతగా అభివృద్ధి చెందని కాలంలోనే పర్యావరణ అనుకూలమైన,  వనరుల  దుర్వినియోగం జరగని సర్క్యులర్ ఎకానమీ   అనే భావనను సంప్రదాయంలో  ఇమిడ్చారు.  

దురదృష్టవశాత్తు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో  పర్యావరణానికి హానికరం,  సహజ వనరుల దుర్వినియోగం,  ఆర్థిక భారాన్నిపెంచే  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా ‘రేఖీయ ఆర్థిక వ్యవస్థ’ ( లీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ)విధానాలను  అనుసరిస్తున్నారు.  

సర్క్యులర్  ఎకానమీకి రేఖీయ ఆర్థికవ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.  రేఖీయ ఆర్థికవ్యవస్థ  ‘తీసుకోవడం’,  ‘తయారు చేయడం’,  ‘పారవేయడం’  అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.  రేఖీయ ఆర్థికవ్యవస్థ పర్యావరణానికి  హానికరం అయినది.  ఈ పద్దతిలో  ఘన వ్యర్థాలు,  ఇతర వ్యర్థాలు  అధిక మొత్తంలో  ఏర్పడతాయి.  ముడి పదార్థాలు, సహజ వనరులు వృథా అవుతాయి.  ఉదాహరణకు సింగిల్ యూజ్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్, పేపర్  టీ కప్స్,  ప్లాస్టిక్  కోటెడ్ పేపర్ ప్లేట్స్ మొదలగునవి.  

పర్యావరణ హానికరం..ధ్వని కాలుష్యాన్ని అరికట్టాలి

శాస్ర్త్ర, సాంకేతిక రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని ఉపయోగించుకొని  రసాయనాలతో  తయారుచేసిన రంగులతో,  వివిధ రూపాలలో గణపతి  విగ్రహాలను  తయారుచేసి పర్యావరణానికి హాని చేయడం, అధునాతన 'డీజే' వంటి ధ్వని కాలుష్యాన్ని  కలగజేసే  పరికరాలను వాడటం  సరైనది  కాదు.  శాస్ర్త్ర, సాంకేతిక రంగాలలో జరిగే  అభివృద్ధిని  సమాజానికి  మేలుచేసే విధంగా ఉపయోగించుకోవాలి. 

ఐన్‌‌‌‌‌‌‌‌స్టీన్  భావన ప్రకారం  ‘మతం లేని సైన్స్ కుంటిది’,  ‘సైన్స్ లేని మతం గుడ్డిది’.  ఇక్కడ  మతం అంటే ఆధ్యాత్మిక  జ్ఞానం,  నైతిక విలువలు.  సైంటిఫిక్  ఆవిష్కరణల అభివృద్ధిని  నైతిక  విలువలకు లోబడి  సమాజానికి  మేలుచేసే విధంగా  అమలుచేయాలి అనేది ఐన్‌‌‌‌‌‌‌‌స్టీన్  అభిప్రాయం. 

శాస్ర్త్ర, సాంకేతిక రంగాలలో అంతగా అభివృద్ధి చెందని రోజులలోనే  పర్యావరణ మేలు,  సమాజహితం కోసం మట్టి గణపతిని మన సంప్రదాయంలో  చేర్చారు. అభివృద్ధి చెందిన  పాశ్చాత్య దేశాలలో నీటిని దేవతా  స్వరూపంగా భావించరు.  కానీ వారు నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటారు.

నీటిని దేవతా స్వరూపంగా పూజించే  భారత దేశ సంప్రదాయంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్  విగ్రహాలను నిమజ్జనం చేసి జలకాలుష్యాన్ని సృష్టిస్తున్నారు.  నీటివనరులలోనికి  విడిచిన కాలుష్యకారకాలు బయోమాగ్నిఫికేషన్ చెంది ఆహారం ద్వారా తిరిగి మానవుల శరీరంలోకి వచ్చి చేరుతాయి.  ఈ చెడు పరిణామాలను  దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు వినాయక చవితి పండుగను  పర్యావరణానికి అనుకూలంగా, సర్క్యులర్ ఎకానమీ  విధానాలతో సంప్రదాయాన్ని   రూపొందించటం జరిగింది.  కాబట్టి  మన పూర్వీకుల సంప్రదాయ పద్ధతులను అనుసరించి వినాయక చవితి పండుగను జరుపుకుంటే పర్యావరణంతోపాటు ప్రజలకు మంచిది.  

భారతదేశంలో వినాయక చవితి పండుగ అతిపెద్ద  ప్రధానమైనది. ఈ పండుగను నగరాల నుంచి గ్రామాల వరకూ దేశ ప్రజలందరూ వినాయకుని విగ్రహాన్ని తమ తమ ప్రాంతాల్లో  ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు ఆనందభరితంగా జరుపుకునే పండుగ. అనాదిగా  హిందూ  సంప్రదాయం ప్రకారం మట్టి గణపతిని ప్రతిష్ఠించి  పూజించడం ఆచారం.  మట్టి గణపతిని పూజించే ఆచారంలో పర్యావరణ అంశాలతోపాటు సర్క్యులర్ ఎకానమీ (వృత్తాకార ఆర్థిక వ్యవస్థ) వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి.  

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్,  ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.