2027 జూన్ నాటికి ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

2027 జూన్ నాటికి ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి
  • ప్రస్తుతం డే అండ్ నైట్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు కంపెనీలు మారడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమైయ్యాయని చెప్పారు. గురువారం శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, పింగిలి శ్రీపాల్‌‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

2017–18లో ప్రారంభమైన ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పనులు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించి పనులను పునఃప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం పగలు, రాత్రి తేడా లేకుండా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే జూన్ నాటికి ఫ్లైఓవర్‌‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

భూపాలపల్లిలో రూ.275 కోట్ల పనులు..

భూపాలపల్లి జిల్లాలో వివిధ పథకాల కింద రహదారి అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్లాన్ స్కీమ్ కింద రూ.84 కోట్లతో నాలుగు పనులు మంజూరు చేశామని చెప్పారు. హెచ్‌‌ఏఎం పద్ధతిలో రూ.150.35 కోట్లతో ఐదు పనులు మంజూరు కాగా, టెండర్లు పూర్తయ్యాయని, ఒప్పంద ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎస్‌‌టీఎస్‌‌డీఎఫ్ పథకం కింద రూ.35 కోట్లతో రెండు పనులు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.