బీఆర్ఎస్ నాయకులు దళితుడైన అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించడమే కాకుండా అతని తల్లిని కూడా దూషించడం సహించరానిది. ఇది తీవ్రమైన నేరం కూడా. వారు ఏ స్థాయి నాయకులైనా చట్టపరంగా శిక్షార్హులు. అక్కడితో ఆగకుండా ఈ అమానవీయ సంఘటనపై నిరసన తెలపడానికి దళితులు డప్పులతో వెళ్లిన దారిని కూడా పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేశారు.
బీఆర్ఎస్ నాయకుల చర్య క్షమించరానిది. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా అర్థం కావటం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే. రాజ్యాంగం చెబుతున్న సమానత్వాన్ని అతిక్రమించడమే. బీఆర్ఎస్ నాయకులు ఈమాత్రం ప్రాథమిక జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్‌లో భాగంగా అంటరానితనంను నిర్మూలించాలి. దళితులు నడిచిన నేలను శుద్ధీకరణ చేయడం అంటరానితనానికి నిదర్శనం. రాజ్యాంగాన్ని మరిచి కులహంకారంతో వ్యవహరించేవారు రాజ్యాంగ రాజకీయాలకు అర్హులేనా?
దళితుల పట్ల రాజకీయ పార్టీలు కుల వివక్షను పాటించడం, శుద్ధీకరణలను చేపట్టడం రాష్ట్రంలోనే కాదు. జాతీయస్థాయిలో కూడా కనిపిస్తోంది. ఆగస్టు నెలలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్వానిలో జరిగిన ర్యాలీ తర్వాత ఇలాంటి ఘటనే జరిగింది.
బీజేపీ అనుబంధ సంస్థ శ్రీరామ్ సేన, ఖర్గే ప్రసంగించిన సభాస్థలాన్ని శుద్ధి చేయడం తీవ్రనేరం. దానిపై చర్యలు తీసుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పలువురు ఎంపీలు, ప్రజా సంఘాలు నిరసన తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్‌ను రిజిస్టర్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు బీఆర్‌ఎస్‌లాగ బీజేపీ కూడా పబ్లిక్ ప్లేస్‌లలో ఇలా వ్యవహరించడం చూస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ఐడియాలాజికల్‌గా, రాజకీయంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ కూడా దళితుల రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నది.
అమానవీయ చర్యలు ఇంకెన్నాళ్లు?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కూడా బీజేపీ నాయకత్వం అదేవిధంగా అవమానపరిచింది. ఉత్తరప్రదేశ్ కనోజ్‌లోని గౌరీ శంకర్ మహదేవ్ మందిర్‌లో అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ పూజలు జరిపి వెళ్లిపోగానే బీజేపీ కార్యకర్తలు గంగాజలంతో మహదేవ్ మందిర్‌ను శుద్ధీకరణ జరిపారు.
అదేవిధంగా 2017లో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి భవనాన్ని ఖాళీచేసి వెళ్లినప్పుడు నూతనంగా ఎన్నికయిన బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ భవనాన్ని గంగాజలంతో శుద్ధీకరణ చేశారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక అమానవీయ చర్యలు ఇంకెన్నాళ్లు కొనసాగాలి? ఈ దేశంలో సామాన్యులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులు, జాతీయస్థాయిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన భారత రాష్ట్రపతులు కూడా ఇలాంటి కులవివక్షకు, అంటరానితనానికి అతీతులు కాకుండా పోతున్నారు.
రాష్ట్రపతికి సైతం తప్పని అవమానం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023లో ఢిల్లీలోని జగన్నాథ్ మందిరానికి వెళ్ళినప్పుడు వారు ఆదివాసీ సమాజానికి చెందినందున గర్భగుడిలో కాకుండా బయటినుంచే మొక్కుకునే స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వారితో వెళ్లిన మంత్రులు మాత్రం గర్భగుడిలోకి వెళ్లి పూజించుకునేవిధంగా అనుమతించడం రాజ్యాంగ వ్యతిరేకచర్యకాక మరేమవుతుంది.
భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దళితుడైనందున పూరీ జగన్నాథ్ టెంపుల్‌లో 2018 మార్చిలో ఇలాంటి సంఘటననే ఎదుర్కోవాల్సి వచ్చింది. వారిని కూడా గర్భగుడిలోకి రానీయకుండా బయటినుంచే పూజ చేసుకునే స్థితి వచ్చింది. అయితే వారు మాత్రం నిరసన తెలపడం జరిగింది. 19వ శతాబ్దంలో ఆర్య సమాజ్ చేపట్టిన మతపరమైన శుద్ధీకరణ ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను అవమానపరిచేవిధంగా రూపాంతరం చెందడం అత్యంత హేయమైన చర్య.
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లయినా కొనసాగుతున్న వివక్ష
స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఇంకా వివక్షకు గురవుతున్నారు. ఇది ఒక రాజకీయ రంగమే కాదు. అభివృద్ధి, విద్య, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా వివక్ష కొనసాగుతున్నది. అంటరానితనంపై పోరాటాలు జరుగుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రాజకీయ నాయకత్వం కులవివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. నిచ్చెన మెట్ల కుల సమాజంలో ఆధిపత్య కుల స్వభావాన్ని ఛేదించకుండా సమానత్వాన్ని సాధించలేం.
బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజ్యాంగాన్ని మార్చాలనే చర్చను కూడా తెరపైకి తెచ్చారు. దీనిద్వారా మనువాద ఆర్ఎస్ఎస్, - బీజేపీల సాంప్రదాయక కులతత్వ స్పృహను దేశంమీద రుద్ధి భారతజాతిని విభజిస్తూ వెనుకబాటుతనానికి గురిచేయాలని ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కులాధిపత్య సంప్రదాయం పేరుమీద ఆదివాసీ, దళిత, ఓబీసీ సమాజాలను మోడరనైజేషన్‌కు దూరంగా నెట్టివేస్తున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పోటీపడి ఉత్పత్తి కులాల విద్యను కూడా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యకోసం కేటాయించిన బడ్జెట్‌ను విపరీతంగా తగ్గించి ప్రాథమిక పాఠశాలలను మూసే పథకాలను అమలులో పెట్టిండ్రు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బహుజన వ్యతిరేక ప్రచారం
యూనివర్సిటీ స్థాయి విద్యను వ్యాపారంగా మార్చడంతో బహుజనులు నాణ్యమైన, సమానత్వంతో కూడిన విద్యను అందుకోలేకపోతున్నారు. కులగణన విషయంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకేవిధంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ కులగణన విషయంలో ఓబీసీలను మోసం చేస్తున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో జరిగిన కుల సర్వేను ఆచరణలో తీవ్రంగా వ్యతిరేకించింది.
బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకత్వం కుల సర్వేలో పాల్గొనలేదు. ఇది స్పష్టంగా ఓబీసీ, దళిత, ఆదివాసీ వ్యతిరేక మనస్తత్వంతో కూడుకున్న పార్టీగా గుర్తించాలి. ఇలాంటి తిరోగమన మనస్తత్వంతో కూడుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను దళిత బహుజనులు ఎక్స్ రే తీయాల్సిన అవసరం ఉన్నది. వీరి వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ అగ్రకుల మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోకుండా దళిత, ఓబీసీ, ఆదివాసుల అభివృద్ధి సాధ్యం కాదు.
బీజేపీ పాలనలో వీరిని హిందూ వ్యతిరేకులు అనే ముద్ర వేస్తున్నారు. వీరందరూ మత విశ్వాసాన్ని కలిగిన వారు. కానీ బీజేపీ,- ఆర్ఎస్ఎస్ లాంటివి వారి అగ్రకులతత్వంతో వ్యాపార-, రాజకీయ లబ్ధి కోసం బహుజన వ్యతిరేక ప్రచారాలను కొనసాగిస్తున్నారు.
ఈ దేశ హిందువులుగా, ఐక్యతను భారత జాతి నిర్మాణంకోసం జీవిస్తున్న ఉత్పత్తి సమాజాలు, జరుగుతున్న రాజకీయ పరిణామాలను, సాంస్కృతిక అణచివేతను, విద్య, సామాజిక అధికారానికి దూరం చేస్తున్న పద్ధతులను నిశితంగా చర్చిస్తూ, విశ్లేషిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్‌వాది పార్టీ, తెలంగాణ
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
