శాంతియుత కార్యకలాపాలకే అంతరిక్ష వినియోగం..తొలి ఇంటర్నేషనల్ స్పేస్ సమిట్‌‌లో ప్రధాని మోదీ

శాంతియుత కార్యకలాపాలకే  అంతరిక్ష వినియోగం..తొలి ఇంటర్నేషనల్ స్పేస్ సమిట్‌‌లో ప్రధాని మోదీ
  • వర్చువల్‌‌గా ప్రసంగం.. సైంటిస్టుల కృషికి ప్రశంసలు

  న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు లోబడి సురక్షితమైన, శాంతియుతమైన, స్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాస్త్రీయ సమాచారం ఎప్పుడూ పారదర్శకత, సమగ్రతతో కూడిన ఉమ్మడి ప్రయోజనాలకే ఉపయోగపడాలని ఆయన ఉద్ఘాటించారు

తొలి అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమిట్) ఉద్దేశించి ప్రధాని మోదీ గురువారం వర్చువల్ విధానంలో ప్రసంగించారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తికి అంతుచిక్కని స్ఫూర్తిని ఇస్తోందని, నేడు వాతావరణం, వ్యవసాయం నుంచి మహాసముద్రాల వరకు భూమిపై ప్రతి జీవితాన్ని అది ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. భారత అంతరిక్ష యాత్ర 'వసుధైక కుటుంబ' తత్వంలో వేళ్లూనుకుని ఉందని, ఈ స్ఫూర్తిని ఇప్పుడు భూమి దాటి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రపంచ దేశాలకు ఇస్రో సేవలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన అద్భుతమైన ప్రదర్శన, తక్కువ ఖర్చుతో కూడిన మిషన్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రధాని ప్రశంసించారు. ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి తరతరాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్ల అంకితభావం, కఠిన శ్రమే కారణమని కొనియాడారు. 

ఇస్రో తయారీ, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు బదలాయించాలన్న ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాల నుంచి చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భారతీయ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపబడ్డాయని గుర్తుచేశారు. చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించిందని, ఆదిత్య-ఎల్1 సూర్యుడి రహస్యాలను ఛేదిస్తోందని మోదీ చెప్పారు.

 జర్మనీ చాన్స్​లర్​తో ప్రధాని ఫోన్ ​సంభాషణ

యూరప్‌‌తో భారత్ బంధానికి జర్మనీ అత్యంత కీలకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జర్మనీ చాన్స్​లర్​గా బాధ్యతలు చేపట్టిన ఫ్రైడ్రిచ్ మెర్జ్‌‌తో ప్రధాని టెలిఫోన్ ద్వారా సంభాషించారు. భారత్-, జర్మనీ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, టాలెంట్ మొబిలిటీ వంటి పలు కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అంగీకరించినట్లు మోదీ తెలిపారు.