చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సి.జోసెఫ్ విజయ్.. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అనుకరిస్తూ చేసిన సంజ్ఞలపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో పోలీసుల దెబ్బలకు తన దవడ విరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ గురువారం స్టాలిన్ ‘ఎక్స్’లో ఓ వీడియోను విడుదల చేశారు.
1976లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత, జనవరి 31న పోలీసులు తనను మీసా చట్టం కింద అరెస్టు చేశారని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ ముగిసేవరకు (మార్చి 1977) మద్రాస్ సెంట్రల్ జైలులోనే గడిపానని, అక్కడ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు.
పది మందిని ఒకే చిన్న గదిలో ఉంచి, మూత్ర విసర్జనకు ఒకే పాత్రను ఉపయోగించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీలో మీరు కూడా దవడ దగ్గర చేయి పెట్టి చూపించారు కదా? అవును, ఆనాడు పోలీసులు కొట్టిన దెబ్బల తాలూకు మచ్చలు ఇప్పటికీ నా ముఖంపై ఉన్నాయి. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
మీసా కింద జైలుకు వెళ్లినట్టు ప్రూఫ్స్ ఏవీ?: టీవీకే
స్టాలిన్ వీడియోపై టీవీకే మండిపడింది.ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ నాటకానికి తెరతీశారని, జైలు శిక్షకు సంబంధించి ఆయన ఎలాంటి అధికారిక ఆధారాలను చూపించలేదని ‘ఎక్స్’లో పేర్కొంది. తాను ‘మీసా’ చట్టం కింద అరెస్టయినట్లు నిరూపించే డిటెన్షన్ ఆర్డర్ కాపీని గానీ, జైలు రికార్డులను గానీ స్టాలిన్ చూపించలేదని తెలిపింది.
