రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం విద్యార్థులు ఆందోళన చేయాల్సి వస్తోంది: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన

రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం విద్యార్థులు ఆందోళన చేయాల్సి వస్తోంది: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన
  • బీసీలు విద్యకు దూరమయ్యే దుస్థితి ఏర్పడిందన్న తీన్మార్ మల్లన్న
  • పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న పెండింగ్ ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్​తో చెలగాటమాడుతున్న కాలేజీ యాజమాన్యాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సకాలంలో అందక బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ్యుల ప్రశ్నలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ సర్టిఫికెట్ల జారీ కోసం కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతూ అక్రమంగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

మరో వైపు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్లు, పీఈటీల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, దీనిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.