మధిర, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రెండో జోన్‌కు గురువారం గోదావరి జలాలు చేరాయి. ఈ జోన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు సాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు.
మధిర బ్రాంచ్ కెనాల్, నిదానపురం మేజర్ ద్వారా గోదావరి జలాలు చేరగా.. నాగవరప్పాడు సమీపంలోని సాగర్ కాలువ వద్ద కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరంశెట్టి కిశోర్, రైతులు పాల్గొన్నారు.
