ఖమ్మం, వెలుగు: 22ఏ నిషేధిత ఆస్తుల జాబితా వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్‌చేశారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ 22ఏ జాబితా వల్ల ఏళ్ల తరబడి తమ భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజల భూ సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వరంగల్ ప్రభారి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నల్గొండ ప్రభారి సన్నె ఉదయ్ ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రామలింగేశ్వరరావు, పుల్లారావు యాదవ్ పాల్గొన్నారు.
