హసన్ పర్తి, వెలుగు: వరంగల్ కమిషనరేట్ హసన్‌పర్తి పీఎస్ పరిధిలో మిస్ అయిన మహిళ హత్యకు గురైంది. హసన్ పర్తిలో దాదాపు నాలుగు నెలల కిందట ఓ మహిళ అదృశ్యం కాగా.. విచారణ చేపట్టిన పోలీసులు కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన స్వప్న(40)కు కమలాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం అయింది. కొన్నేండ్ల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్న స్వప్న శాంతి పూజలు నేర్చుకునేందుకు బళ్లారికి వెళ్లి వచ్చేది. అక్కడ వర్ధరాజుల బస్వరాజు అనే వ్యక్తితో పరిచయం కాగా.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మే 15న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన స్వప్న తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో మే 31న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చంపి, అక్కడే పూడ్చేసి..
మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన హసన్‌పర్తి పోలీసులు టెక్నాలజీ ఆధారంగా స్వప్న బళ్లారి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారణ చేపట్టి బస్వరాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. స్వప్నను హత్య చేసి, అక్కడే పాతిపెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా హసన్‌పర్తి పోలీసులు స్వప్న డెడ్‌బాడీ అవశేషాలను వెలికితీసి, నిందితుడిని బుధవారం హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. కాగా అక్కడ లభించిన అవశేషాలు స్వప్నకు చెందినవా కాదా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది.
